ఆగ‌స్టు 1న ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం.. మోదీ చేతుల మీదుగా ఎయిర్ పోర్ట్ ప్రారంభం

Published : Jul 21, 2026, 08:17 PM IST

Andhra pradesh: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రారంభం కానుంది.

PREV
15
ఆగస్టు 1న ప్రారంభం.. ఉత్తరాంధ్రకు హిస్టారికల్ డే

భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త అభివృద్ధి ద్వారాలను తెరుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ వేడుక ఉత్తరాంధ్ర చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

25
విమానాశ్రయంతో పాటు మరిన్ని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ప్రారంభం

విమానాశ్రయ ప్రయాణికుల టెర్మినల్ భవనంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీ, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, విమానయాన రంగంలో కొత్త అవకాశాలను తీసుకురానున్నాయి. భోగాపురం ప్రాంతాన్ని భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి ఏవియేషన్, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇవి కీలకంగా మారనున్నాయి.

35
లాజిస్టిక్స్ హబ్‌గా భోగాపురం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచ దేశాలతో నేరుగా అనుసంధానం మరింత బలపడుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఉండటంతో దిగుమతులు, ఎగుమతులు, కార్గో రవాణాకు ఈ విమానాశ్రయం కీలక కేంద్రంగా మారనుందని చెప్పారు. పరిశ్రమలు, పర్యాటకం, ఐటీ, వ్యాపార రంగాలకు ఇది కొత్త ఊపునివ్వడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

45
భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం

విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, భూ యజమానుల సేవలను గుర్తిస్తూ వారికి ప్రత్యేకంగా ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అభివృద్ధికి సహకరించిన వారి పాత్రను ప్రభుత్వం గౌరవిస్తోందనే సందేశం వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

55
ఉత్తరాంధ్ర అంతా పండుగ వాతావరణం.. భారీ ఏర్పాట్లు

ప్రారంభోత్సవాన్ని ఉత్తరాంధ్ర ప్రజలందరి వేడుకగా మార్చాలని సీఎం సూచించారు. జూలై 31 వరకు విమానాశ్రయం గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ ఈ కార్యక్రమం ప్రాధాన్యం చేరేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. సభకు వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, అల్పాహారం, భోజనం వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా థింసా, సవర, కొమ్ము కోయ వంటి గిరిజన నృత్యాలతో ఘన స్వాగతం పలకాలని సీఎం సూచించారు. అంతర్జాతీయ ప్లాట్ ఫామ్ లపై గుర్తింపు పొందుతున్న అరకు కాఫీ బ్రాండింగ్‌ను కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలపాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు.

Read more Photos on
click me!

Recommended Stories