ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అర‌బ్ కంపెనీ రూ. 100 కోట్ల పెట్టుబ‌డి.. ఈ ప్రాంత రూపు రేఖ‌లు మార‌డం ఖాయం

Published : Jul 21, 2026, 07:24 PM IST

Andhra Pradesh: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కొత్త ఊపిరి పోసుకుంది. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదిరిన పెట్టుబడి ఒప్పందాల్లో మరోటి కార్యరూపం దాల్చింది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ప్రపంచ స్థాయి డిమాండ్ ల‌భించ‌నుంది.

PREV
15
దావోస్ ఒప్పందానికి ఆరు నెలల్లోనే ఫలితం

ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు అంతర్జాతీయ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో కీలకమైన యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఒప్పందం ఇప్పుడు అమలు దశకు చేరుకుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB), యూఏఈ ఫుడ్ క్లస్టర్ మధ్య అధికారికంగా అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

25
చిత్తూరులో రూ.100 కోట్లతో ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్

ఈ ఒప్పందంలో తొలి పెట్టుబడిగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో అత్యాధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్‌లో మామిడి, అరటి, కోకోతో పాటు ఇతర ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెస్ చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 దేశాలకు ఎగుమతి చేయనున్నారు.

35
రైతులకు కొత్త మార్కెట్..

ఈ భాగస్వామ్యం వల్ల రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు భారీ అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటి వరకు స్థానిక మార్కెట్లకే పరిమితమైన పండ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఇకపై విలువ జోడించిన ఉత్పత్తుల రూపంలో విదేశీ మార్కెట్లకు చేరనున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడటంతో రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంది. అలాగే ఆహార శుద్ధి రంగంలో కొత్త పరిశ్రమలు రావడం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి.

45
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులను మరింత వేగంగా ఆకర్షించేందుకు "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో రాయలసీమను దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్‌కు వస్తోందని ఆయన పేర్కొన్నారు.

55
యూఏఈ పెట్టుబడిదారులకు సీఎం ఆహ్వానం

కృష్ణా-గోదావరి డెల్టా సారవంతమైన భూములు, 200కు పైగా ఉద్యాన క్లస్టర్లు, పోర్టులు, రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాల వంటి బలమైన మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రత్యేకతలని సీఎం వివరించారు. త్వరలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అందుబాటులోకి రానుండటంతో ఎగుమతులు, లాజిస్టిక్స్ రంగం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో లభిస్తున్న అవకాశాలను వినియోగించుకుని పెట్టుబడులు పెట్టాలని యూఏఈ పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే రైతుల ఆదాయం పెరగడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కలగనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories