Rain Alert : ఉపరితల ఆవర్తనం, ద్రోణి, అల్పపీడనం ఒకేసారి అటాక్.. ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సం, అల్లకల్లోలమే

Published : May 02, 2026, 07:46 PM IST

IMD Rain Alert : ఉపరితల ఆవర్తనం, ద్రోణి,  అల్పపీడనం.. ఈ మూడు ఒకేసారి అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి…? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇదే… వీటి ప్రభావంతో వర్ష బిభత్సం తప్పేలా లేదు. 

PREV
15
వాతావరణ సమాచారం..

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వింత వాతావరణం కొనసాగుతోంది. వేసవికాలం కాబట్టి ఎండలు మండిపోతున్నాయి.. ఇదే సమయంలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఓ రోజులో ఉదయమే భానుడి భగభగలు మొదలవుతున్నాయి... మధ్యాహ్నానికి ఎండ తారాస్థాయికి చేరుతోంది... ఇక సాయంత్రం ఆకాశం మేఘాలతో కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఎండావానల పరిస్థితే మరికొద్దిరోజులు కొనసాగనుందని వాతావరణ శాఖ చెబుతోంది... ఆసక్తికరంగా ఎండల తీవ్రమవడంతో పాటు వానలు కూడా జోరందుకుంటాయని హెచ్చరిస్తోంది.

25
ఆంధ్ర ప్రదేశ్ లో వానలే వానలు..

ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని... ఇకపై వానలు జోరందుకుంటాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. రాజస్థాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం... తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో ఇవాళ (శనివారం) మెళ్లిగా వర్షాలు మొదలవుతాయని... రేపు (మే 3, ఆదివారం) కొన్ని జిల్లాల్లో జోరువానలు కురుస్తాయని హెచ్చరించారు.

ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని APSDMA ఎండీ హెచ్చరించారు. వీటి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. చాలాచోట్ల ఉరుములు,మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని... అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించారు.

35
సోమవారం నుండి జోరువానలు...

ఏపీ ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ చల్లని కబురు చెప్పింది. ఈ రెండ్రోజులు (శని, ఆదివారం) ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా సోమవారం (మే 4) నుండి చల్లని ఆహ్లాదరకమైన వాతావరణం ఉంటుందని తెలిపింది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని... వేడిగాలులు, ఉక్కపోత నుండి ఉపశమనం లభిస్తుందని తెలిపింది. ఆకాశం మేఘావృతమై, ఈదురు గాలులతో కూడిన వర్షపాతం ఉంటుంది... కాబట్టి రైతులు పంటనష్టం జరక్కుండా వ్యవసాయ కార్యకలాపాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇవాళ (శనివారం) మండలాలవారిగా చూసుకుంటే విజయనగరం 8, మన్యం 10, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు 1, పల్నాడు 19, మార్కాపురం 6, ప్రకాశం 10, నెల్లూరు 3, తిరుపతి 4... మొత్తంగా రాష్ట్రంలోని 64 మండలాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు మొదలవుతాయని... రేపు కూడా కొనసాగి ఎల్లుండి మరింత ఊపందుకుంటాయని విపత్తు సంస్థ అంచనా వేస్తోంది.

45
ఏపిలో మండుటెండలు.. హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఇక్కడే

వేసవి ఎండలు ప్రస్తుతం పీక్స్ కు చేరాయి... ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ (మే 2) ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో ఏకంగా 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 17 జిల్లాల్లోని 239 మండలాలపై ఎండ ప్రభావం తీవ్రంగా ఉందని... అక్కడ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి 

ప్రకాశం (కొప్పెరపాడు) : 45.4°C

మార్కాపురం (బొట్లగూడూరు) : 45.1°C

తిరుపతి (వెంకటగిరి) : 45°C

నెల్లూరు (కలిగిరి) : 44.4°C

పల్నాడు (నూజెండ్ల) : 44.3°C

నంద్యాల (దొర్నిపాడు), చిత్తూరు (తవణంపల్లె) : 44.1°C

వైఎస్సార్ కడప (కలసపాడు) : 43.9°C

బాపట్ల (కారంచేడు) : 43.7°C

కర్నూలు (మంత్రాలయం) : 43.2°C

అనంతపురం (తెరన్నపల్లి) : 42.8°C

ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ తూర్పు) : 42.4°C

55
ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న మండలాల సంఖ్యను పరిశీలిస్తే.. కడప జిల్లాలో అత్యధికంగా  34 ఉన్నాయి. ఇక నెల్లూరులో 32, తిరుపతిలో 29, పల్నాడులో 26, ప్రకాశంలో 25, మార్కాపురంలో 21, నంద్యాలలో 20, కర్నూలులో 17, చిత్తూరులో 10 మండలాలు అధిక ప్రభావానికి గురవుతున్నాయి.

ఆదివారం గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు అనే ఆరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక మరో 124 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందట... అవి పల్నాడు (22), ఎన్టీఆర్ (14), మన్యం (12), గుంటూరు (12), విజయనగరం (10), బాపట్ల (9), కృష్ణా (7), పోలవరం (5), తిరుపతి (5), నెల్లూరు (4), తూర్పుగోదావరి (3), మార్కాపురం (3), ఏలూరు (2), అల్లూరి (1).

ఎండలు, ఉక్కపోతతో పాటు వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు మరింత జాగ్రత్తగా ఉండాలని… పిడుగుల బారిన పడకుండా ఉండేందుకు చెట్ల కింద అస్సలు నిలబడరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇక మధ్యాహ్నం ఎండల్లో మంచినీరు, గొడుగు వంటివి తీసుకునే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories