ఏపీలో వర్షాలే వర్షాలు...
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వర్షాలకు అనుకూలమైన వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందట... ఇక ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు మరో ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని... చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. తీరం వెంబడి 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అల్లకల్లోలం సృష్టించవచ్చు... కాబట్టి తీరప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని IMD సూచిస్తోంది. నాలుగైదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వేసవి వర్షాలు చాలా ప్రమాదకరమైనవి... పిడుగులు, ఈదురుగాలులు ప్రమాదాలను సృష్టించే అవకాశాలుంటాయి... కాబట్టి రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) సూచిస్తోంది. ముఖ్యంగా వర్ష సమయంలో చెట్ల కింద ఉండరాదని... సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెబుతోంది.