Heavy Rain Alert : వాయుగుండం తీరందాటే వేళ ఈ జిల్లాల్లో అల్లకల్లలమే.. సాయం కోసం ఈ నెంబర్లకు కాల్ చేయండి

Published : Sep 23, 2026, 05:26 PM IST

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక తీవ్ర వాయుగుండం తీరందాటితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలకు సాయం కోసం కంట్రోల్ రూమ్స్, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటుచేశారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

PREV
14
ఆంధ్ర ప్రదేశ్ లో అతిభారీ వర్షాలు

ఎల్ నినో ప్రభావంతో ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా వర్షాలు కురిసిందిలేదు. కానీ గత రెండుమూడు రోజులుగా రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, అదికాస్తా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది... దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వర్షాలు, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించి జిల్లాల అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్, డీజీపీతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షాల తీవ్రత, ప్రభావిత ప్రాంతాలు, తీసుకుంటున్న ముందస్తు చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం గమనించాలని అధికారులకు స్పష్టం చేశారు.

24
విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర తీరంవైపు కదులుతోంది. ఇది సెప్టెంబర్ 23న అంటే ఇవాళ (బుధవారం) రాత్రి విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌కు సెప్టెంబర్ 23న అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. సెప్టెంబర్ 24న భారీ నుంచి అతి భారీ వర్షాలు, 25న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా హెచ్చరికల్లో పేర్కొంది. ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులకు కూడా అవకాశం ఉందని తెలిపింది.

261 మండలాలపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలోని 261 మండలాల్లో వర్షాల పరిస్థితిపై ప్రత్యేకంగా అంచనాలు రూపొందించారు అధికారులు. వీటిలో 129 మండలాలకు భారీ వర్షం, 121 మండలాల్లో సాధారణ వర్షపాతం, 9 మండలాల్లో అతి భారీ వర్షాలు, 2 మండలాల్లో తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఉత్తర కోస్తా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే వాగులు, వంకల్లో ఆకస్మికంగా వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో వాగులు, కాలువలు, నదులు దాటే ప్రయత్నాలు చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్లాష్ ప్లడ్స్ కు అవకాశాలున్న ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాతావరణ రిపోర్ట్స్ ప్రకారం… సెప్టెంబర్ 22న శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం 30 మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో 28 మండలాల్లో 26 మండలాలకు 10 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ 14 మండలాల్లో 10 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కూడా పలు మండలాల్లో వర్షాలు నమోదయ్యాయి.

అయితే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంది. రాష్ట్ర సగటు వర్షపాతం 285 మిల్లీమీటర్లు కాగా, సాధారణంగా ఈ కాలంలో 531.2 మిల్లీమీటర్లు ఉండాలి. అంటే ఇప్పటివరకు రాష్ట్రంలో 46.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తాజాగా ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఒక్కసారిగా వర్షాల తీవ్రత పెరిగింది.

34
భారీ వర్షాలతో అల్లకల్లోలమే... కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు : 112, 1070, 18004250101

జిల్లాలవారిగా కంట్రోల్ రూమ్ నెంబర్లు

శ్రీకాకుళం - 08942-240557 లేదా 6309990933

విజయనగరం - 08922-236947

పార్వతీపురం మన్యం - 08963450347

అల్లూరి సీతారామరాజు జిల్లా - 9493415670

పోలవరం - 9949903368

విశాఖపట్నం - 0891-2590102 లేదా 0891-2590100

అనకాపల్లి - 08924222888 లేదా 08924226599 లేదా 08924225999

కాకినాడ - 0882-2356801 లేదా 9849903879

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ - 8856293104

తూర్పు గోదావరి - 8977935611 లేదా 9177143999

పశ్చిమ గోదావరి - 08816-299181

ఏలూరు - 18002331077 లేదా 9494041419

క్రుష్ణా - 08672252399

ఎన్టీఆర్ - 9154970454

గుంటూరు - 0863-2234014

పల్నాడు - 08647-252999

ప్రకాశం - 1077 లేదా 08592-281400

నెల్లూరు - 0861-2331261

44
నదులు, రిజర్వాయర్లపై నిరంతర పర్యవేక్షణ

భారీ వర్షాల నేపథ్యంలో నదుల్లో నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశాలు ఉన్న చోట్ల ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. విద్యుత్, రహదారులు, తాగునీరు, వైద్యం వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తీవ్ర వాయుగుండం ప్రభావంతో గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకపోవడం మంచిది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు, శిథిల భవనాల సమీపంలో ఉండకూడదు. వాగులు, కాలువలు, నదులు ఉధృతంగా ప్రవహించే సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించకూడదు.

ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాల ప్రకారం… సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు కోస్తాంధ్రలో వర్షాల ప్రభావం కొనసాగనుంది. దీంతో జిల్లా యంత్రాంగం సూచనలను ప్రజలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వాయుగుండం కదలిక, వర్షాల తీవ్రతను బట్టి తదుపరి హెచ్చరికలు మారే అవకాశం ఉన్నందున తాజా అధికారిక సమాచారాన్ని గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories