Andhra pradesh: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ అమెరికా వెలుపల తన అతిపెద్ద ఏఐ హబ్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించి మంగళవారం ఢిల్లీలో చంద్రబాబు, లోకేష్ కీలక ఒప్పందంపై చేసుకున్నారు. దీంతో విశాఖ భవితవ్యం మారనుంది.
విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వానికి, గూగుల్ సంస్థకు మధ్య మంగళవారం ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో భారీ పెట్టనుంది. భారత్ ఏఐ శక్తి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
25
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని తామే నిర్మించామని, ఇప్పుడు అదే దిశగా విశాఖను కొత్త ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం ఎంతో గర్వకారణంగా ఉందన్న చంద్రబాబు.. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్లు, ఏఐ, రియల్‌టైమ్ డేటా కలెక్షన్లు భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తాయని చెప్పుకొచ్చారు. ఏపీలో గూగుల్ ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
35
గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ
గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ.. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్‌సీ కేబుల్ (subsea cable) ద్వారా నేరుగా కనెక్టివిటీ ఏర్పరిచి, విశాఖను “గ్లోబల్ కనెక్టివిటీ హబ్”గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ డేటా సెంటర్ ద్వారా జెమిని-AI వంటి గూగుల్ సేవలతో ప్రపంచ స్థాయి AI నిపుణులు విశాఖలోనే పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో విశాఖలో భారీగా ఉద్యోగకల్పన జరగనుందని అంచనా వేస్తున్నారు.
గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా విస్తరించనుంది. ఈ పెట్టుబడులతో ఆఫీస్ పార్క్, వసతి ప్రాంతాలు, షాపింగ్ జోన్లు అభివృద్ధి చెందనున్నాయి. అలాగే ఇంజనీర్లు, IT వర్కర్లు, సర్వీస్ ఉద్యోగులు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ డిమాండ్ పెరుగుతుంది. ఇక భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కూడా జరుగుతుండడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఊహించని విధంగా అభివృద్ధి చెందనుంది.
55
ఏఐ సిటీగా వైజాగ్
గూగుల్ రాకతో వైజాగ్ భవిష్యత్తులో ఏఐ సిటీగా మారనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఆసియాలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుందని, 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.