Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు

Published : Jan 22, 2026, 06:59 AM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. క‌ర్నూలు ప్రైవేట్ బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న త‌ర‌హాలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 3 మ‌ర‌ణించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

PREV
12
ప్రయాణంలో ఘోర ప్రమాదం

నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అర్థరాత్రి ప్రమాదానికి గురైంది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బస్సు టైరు ఒక్కసారిగా పేలింది. దాంతో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. వేగంగా దూసుకెళ్లిన బస్సు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది.

22
ఢీకొన్న వెంటనే చెలరేగిన మంటలు

ప్రమాదం జరిగిన క్షణాల్లోనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే అగ్ని వ్యాపించింది. లారీ కూడా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. చీకటి వేళ ఈ ఘటన జరగడంతో మొదట భయానక పరిస్థితి నెలకొంది.

ముగ్గురు అక్కడికక్కడే మృతి

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, లారీ క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటలు తీవ్రంగా ఉండటంతో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి. ఈ ఘటన అందరినీ కలచివేసింది. ప్రయాణికుల సామాన్లు పూర్తిగా బూడిదయ్యాయి.

అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు క్లీనర్ ప్రయాణికులను హెచ్చరించాడు. ఆలస్యం చేయకుండా బయటకు రావాలని సూచించాడు. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఓ డీసీఎం డ్రైవర్ వాహనం ఆపి బస్సు అద్దాలు పగులగొట్టాడు. ప్రయాణికులు కిటికీల్లోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు కూడా వెంటనే సాయం అందించారు.

పోలీసుల చర్యలు, దర్యాప్తు

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల ఎస్పీ సునీల్ సింగ్ స్పందిస్తూ ప్రయాణికులు అందరూ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. టైరు పేలడానికి గల కారణాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read more Photos on
click me!

Recommended Stories