Andhra Kashmir: బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం !

Published : Jul 13, 2026, 08:37 AM IST

Kashmir of Andhra Pradesh: దక్షిణ భారత దేశంలో కూడా మంచు కురిసే ప్రదేశం ఉంది. అదే ఆంధ్రా కాశ్మీర్. విశాఖపట్నం సమీపంలోని ఈ ఆంధ్రా కాశ్మీర్ విశేషాలు, సందర్శనీయ స్థలాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఇది మంచు కురిసే ఆంధ్రా కాశ్మీర్

ఆంధ్రప్రదేశ్‌లో మంచు కురిసే ప్రాంతం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం. సౌత్ ఇండియాలోనే చలికాలంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏకైక ప్రాంతం మన లంబసింగి. అందుకే ఈ ప్రాంతాన్ని "ఆంధ్రా కాశ్మీర్" అని పిలుస్తారు. 

విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలంలో సముద్ర మట్టానికి దాదాపు 1000 నుంచి 1025 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న అందమైన గ్రామం ఇది. విశాఖపట్నం నగరం నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ హిల్ స్టేషన్, ప్రస్తుతం ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు మోస్ట్ ఫేవరెట్ స్పాట్‌గా మారిపోయింది.

26
కొర్రబయలు అంటే ఏంటో తెలుసా?

లంబసింగికి స్థానికంగా కొర్రబయలు అనే మరో పేరు కూడా ఉంది. స్థానిక భాషలో కొర్ర అంటే కర్ర అని, బయలు అంటే బయట అని అర్థం. అంటే చలికాలంలో ఎవరైనా రాత్రి పూట ఇళ్లల్లో ఉండకుండా బయట ఓపెన్ ప్లేస్‌లో ఉంటే, చలికి వాళ్లు కర్రలా గడ్డకట్టుకుపోతారని దీని అర్థం.

ఇక్కడి చలి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఈ పేరే ఒక పెద్ద ఉదాహరణ. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 0 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతాయి. 2008 డిసెంబర్, 2011 జనవరి నెలల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే కిందకు పడిపోయిన రికార్డులు ఉన్నాయి.

36
ఉదయం 10 అయినా రాని సూర్యుడు

లంబసింగి వాతావరణం చాలా విచిత్రంగా, మ్యాజికల్‌గా ఉంటుంది. సాధారణ రోజుల్లో కూడా ఇక్కడ ఉదయం 10 గంటల వరకు సూర్యుడు అస్సలు కనిపించడు. దట్టమైన పొగమంచు కమ్మేసి ఉంటుంది. ఇక చలికాలం విషయానికి వస్తే, డిసెంబర్, జనవరి నెలల్లో చల్లటి గాలులు వణికిస్తాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా సూర్యుడు సరిగ్గా రాడు.

మళ్లీ మధ్యాహ్నం 3 గంటలు దాటిందంటే చాలు, దట్టమైన పొగమంచు రోడ్లను పూర్తిగా కప్పేస్తుంది. పక్కనే ఉన్న మనుషులు కూడా కనిపించనంతగా మంచు కురుస్తుంది. కొన్నిసార్లు తెల్లవారుజామున ఇక్కడ తేలికపాటి మంచు కూడా పేరుకుపోతుంది. ఈ ఫాగీ వెదర్‌లో తెల్లవారుజామున కొండలపై రైడింగ్ చేయడం బైకర్స్‌కు ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

46
బ్రిటీష్ కాలం నాటి కాఫీ తోటలు

ఈ హిల్ స్టేషన్‌లో అడ్వెంచర్ ఇష్టపడే వారి కోసం ట్రెకింగ్, హైకింగ్, క్యాంపింగ్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి కొండలు, దట్టమైన అడవులు, లోయలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. లంబసింగి చుట్టుపక్కల విస్తరించి ఉన్న కాఫీ, మిరియాల తోటలు ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరు.

ఈ తోటలను బ్రిటీష్ కాలం నుండి ఇక్కడ సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించే కాఫీ చాలా నాణ్యమైనది, అందుకే దీనిని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఈ తోటల గుండా ఉదయాన్నే నడవడం పర్యాటకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

56
లంబసింగిలో చూడాల్సిన టాప్ ప్లేసెస్

లంబసింగి చుట్టుపక్కల పర్యాటకులు సందర్శించడానికి కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి:

తాజంగి రిజర్వాయర్: లంబసింగి నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి వెళ్లే దారిలో ఈ చిన్న రిజర్వాయర్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కొండలు, ప్రశాంతంగా ప్రవహించే నీరు ఫోటోగ్రాఫర్లకు పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పాలి.

• కొత్తపల్లి జలపాతం: లంబసింగికి దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో అరకు లోయ పరిధిలో ఈ జలపాతం ఉంది. ఇది ఇప్పటికీ ఎంతో సహజంగా, ఎలాంటి ఆధునిక కట్టడాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది.

• ఉప్పాడ బీచ్: చలి వాతావరణం నుండి కాస్త వెచ్చని సముద్రపు గాలిని ఆస్వాదించాలనుకుంటే కాకినాడ సమీపంలోని ఉప్పాడ బీచ్‌కు వెళ్ళవచ్చు. లంబసింగి నుండి కేవలం రెండు గంటల డ్రైవింగ్ దూరంలో ఈ బీచ్ ఉంటుంది.

• చింతపల్లి: లంబసింగికి సమీపంలో ఉన్న మరో ఫేమస్ ఫారెస్ట్ హిల్ స్టేషన్ చింతపల్లి. ఇక్కడి తాజంగి వ్యాలీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

66
ఫుడ్, వసతి, ప్రయాణ సౌకర్యాలు

లంబసింగి ఇంకా పూర్తి స్థాయిలో కమర్షియల్‌గా డెవలప్ కాలేదు. కాబట్టి ఇక్కడ బస చేయడానికి పెద్ద పెద్ద హోటళ్లు లేదా ఎక్కువ ఫుడ్ ఆప్షన్స్ ఉండవు. పర్యాటకులు బస చేయడానికి విశాఖపట్నంలో ఎన్నో హోటళ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ (APTDC) ఆన్‌లైన్ ద్వారా లంబసింగిలో వసతి కోసం కొన్ని ప్యాకేజీలను అందిస్తోంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ఇక్కడ ఫారెస్ట్ సఫారీ వంటి టూరిజం సర్వీసులను కూడా నడుపుతోంది.

ఎలా వెళ్ళాలి?: లంబసింగి రోడ్డు మార్గం ద్వారా బాగా కనెక్ట్ అయి ఉంది. ఇది విశాఖపట్నం నుండి 101 కిలోమీటర్లు, చింతపల్లి నుండి 19 కిలోమీటర్లు, నర్సీపట్నం నుండి NH5 మీదుగా 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు నుండి దీని దూరం దాదాపు 991 కిలోమీటర్లు. వైజాగ్, నర్సీపట్నం, చింతపల్లి నుండి లంబసింగికి నేరుగా ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories