ఏపీలో 3డీ కాంక్రీట్ ఇళ్లు.. అస‌లేంటీ టెక్నాల‌జీ, 10 రోజుల్లో ఇంటిని ఎలా క‌ట్టేస్తారు.?

Published : Oct 04, 2026, 02:42 PM IST

3D Concrete Printing: పేదల సొంతింటి కలను వేగంగా సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టారు

PREV
14
3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీఎంఏవై–గ్రామీణ్ 2.0 పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 3 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో మొదటి దశలో 75 వేల ఇళ్లకు కేంద్రం అనుమతి లభించగా.. తాజాగా మరో 2.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే బుర్రిపాలెం నుంచి 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ 2.0 కింద ఈ ఇళ్లను నిర్మించనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో గత 28 నెలల వ్యవధిలో సుమారు 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం, కొత్త సాంకేతిక విధానంపై వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

24
177 ఇళ్లతో 3డీ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్ట్

సాధారణంగా ఒక పక్కా ఇంటిని నిర్మించాలంటే ఇటుకలు, ఇసుక, సిమెంట్, ఇనుము, సెంట్రింగ్, నిర్మాణ పరికరాలతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు అవసరం. ఒక్కో దశను పూర్తి చేస్తూ వెళ్లాల్సి రావడంతో నిర్మాణం పూర్తయ్యేందుకు ఎక్కువ సమయం పట్టొచ్చు. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలో నిర్మించనున్న 177 ఇళ్లు ఈ ప్రయోగంలో భాగం. ఒక్క ఇంటి నిర్మాణాన్ని దాదాపు 10 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం పైలట్ ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI)తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది.

34
అసలు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ అంటే ఏంటి?

3డీ కాంక్రీట్ ప్రింటింగ్‌ను సులభంగా చెప్పాలంటే.. కంప్యూటర్‌లో తయారు చేసిన ఇంటి డిజైన్‌ను ఆధారంగా చేసుకుని ప్రత్యేక యంత్రం కాంక్రీట్‌ను పొరలుగా అమర్చి గోడలను నిర్మించే విధానం. సాధారణ ప్రింటర్ కాగితంపై అక్షరాలు లేదా చిత్రాలను ముద్రిస్తే.. 3డీ కాంక్రీట్ ప్రింటర్ నిర్మాణానికి ఉపయోగించే ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలుగా వేసి భవన ఆకారాన్ని రూపొందిస్తుంది.

ముందుగా ఇంటి పూర్తి డిజైన్‌ను కంప్యూటర్‌లో డిజిటల్ మోడల్‌గా తయారు చేస్తారు. ఆ డిజైన్‌ను గాంట్రీ రోబోట్‌కు అనుసంధానిస్తారు. ఈ యంత్రం నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసే పెద్ద ఫ్రేమ్‌లా ఉంటుంది. దానిపై కాంక్రీట్‌ను బయటకు పంపించే ప్రత్యేక ప్రింటర్ హెడ్ ఉంటుంది. కంప్యూటర్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ప్రింటర్ హెడ్ ముందుకు, వెనక్కి, పక్కలకు కదులుతూ నిర్దేశిత ప్రాంతాల్లో కాంక్రీట్ మిశ్రమాన్ని పొరలుగా వేస్తుంది. ఒక్కో పొరపై మరో పొర ఏర్పడుతూ చివరకు ఇంటి గోడల ఆకారం తయారవుతుంది.

44
కాంక్రీట్ మిశ్రమం నుంచి ఇంటి గోడల వరకు..

ఈ టెక్నాలజీలో సాధారణ కాంక్రీట్‌కు భిన్నమైన ప్రత్యేక మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. సిమెంట్, ఇసుక, నీటితో పాటు ఫ్లైయాష్, బగాసే యాష్, అవసరానికి అనుగుణంగా ఇతర పదార్థాలు, ప్రత్యేక రసాయన మిశ్రమాలను నిర్దిష్ట నిష్పత్తిలో కలుపుతారు. యంత్రం ద్వారా సులభంగా బయటకు వచ్చేలా, బయటకు వచ్చిన తర్వాత ఆకారాన్ని నిలబెట్టుకునేలా ఈ కాంక్రీట్ మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు.

కంప్యూటర్‌లో రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం గాంట్రీ రోబోట్ కదులుతుంది. ప్రింటర్ హెడ్ నుంచి వచ్చే కాంక్రీట్‌ను అవసరమైన చోట మాత్రమే వేయడం వల్ల గోడల నిర్మాణ ప్రక్రియ వేగంగా సాగుతుంది. నిర్మాణ పనిలో కొంత భాగం ఆటోమేటెడ్ కావడంతో సంప్రదాయ పద్ధతిలో అవసరమయ్యే కొన్ని దశలు, అదనపు శ్రమను తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంటి డిజైన్‌ను డిజిటల్‌గా ముందుగానే సిద్ధం చేయడం వల్ల కొలతలు, ఆకారం విషయంలో కూడా ఖచ్చితత్వం సాధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ సాంకేతికతపై దేశంలోని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సీఎస్‌ఐఆర్–సీబీఆర్‌ఐ శాస్త్రవేత్తలు భారతీయ వాతావరణ పరిస్థితులు, నిర్మాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. బుర్రిపాలెంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు భౌగోళిక పరిస్థితులు, నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ లభ్యత వంటి అంశాలపై నిపుణులు అధ్యయనం చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే పేదల ఇళ్ల నిర్మాణంలో 3డీ టెక్నాలజీని మరింత విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఏర్పడనుంది.

Read more Photos on
click me!

Recommended Stories