కూరలోనే కాదు, సాంబార్ తయారీలోనూ మనం కందిపప్పును విరివిగా ఉపయోగిస్తుంటాం. అయితే అది సహజంగా ఉంటే ఫర్వాలేదు. పప్పు కల్తీ జరిగితే మాత్రం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రసాయనాలతో కూడిన కేసరి పప్పును కందిపప్పలో కలుపుతున్నట్లు గుర్తించారు.
ప్రతిరోజు సాంబార్ తయారీలో ఉపయోగించే కంది పప్పు కల్తీ లేకుండా ఉండటం లేదు. రసాయనాలతో కూడిన కేసరి పప్పు కలుపుతున్నట్లు గుర్తించారు. ఈ కేసరి పప్పును తీసుకోవడం వల్ల లాథిరిజం అనే ప్రమాదకరమైన నరాల వ్యాధి, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆహార భద్రతా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రలోని కొండ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో విరివిగా పండించే కేసరి పప్పును నాటి పప్పు అని చెప్పి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ పప్పును వ్యాపారులు కంది పప్పులో కలుపుతున్నారు. ఈ సమయంలో అసలు పప్పుకు, కల్తీ పప్పుకు తేడా తెలియకుండా కేసరి పప్పుకు పసుపు రంగు వచ్చేలా టార్ట్రాజిన్ (ఇ-102) రంగును కలుపుతున్నారు. ఈ రంగు క్యాన్సర్ కారకమని ఆహార భద్రతా శాఖ అధికారులు తెలిపారు. తక్కువ ధరకు లభించే కేసరి పప్పును తెచ్చి కంది పప్పులో కలిపి లేదా కేసరి పప్పునే కంది పప్పు లేదా మసూర్ పప్పు అని విక్రయించే దందా అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ కేసరి పప్పు?: కేసరి పప్పు రంగు, ఆకారంలో కంది పప్పును పోలి ఉంటుంది. కానీ అది విషపూరితమైనది. ఇది కలుపు మొక్క, అడవిలో పెరుగుతుంది. కేసరి పప్పును నిరంతరం తీసుకోవడం వల్ల వ్యక్తి లాథిరిజం వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని అతిగా వాడితే కాళ్ల నరాలు, కండరాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇవి చచ్చుబడిపోయి, దీర్ఘకాలంలో శాశ్వత శాశ్వత వైకల్యానికి కూడా దారితీయవచ్చు అని అధికారులు సమాచారం ఇచ్చారు.
కల్తీని గుర్తించే మార్గం ఏమిటి?
మనం కొనుగోలు చేసే పప్పు కంది పప్పు కల్తీ అయిందో లేదో తెలుసుకోవడానికి సుమారు 10 గ్రాముల పప్పులో 25 మి.లీ స్వచ్ఛమైన నీరు పోయాలి. అందులో 5 మి.లీ గాఢత కలిగిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేసి చిన్న మంటపై ఉడికించాలి. అప్పుడు నీటి రంగు మారితే అది కేసరి పప్పు. అలాగే కేసరి పప్పు వాలుగా ఉండే కొనను కలిగి ఉండి చతురస్రాకారంలో ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు.