కొంతమంది చిన్న పనిచేసినా కూడా బాగా అలసిపోతుంటారు. చిన్న చిన్న పనులకే ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయిన భావన కలుగుతుంది. ఇది తక్కువ స్టామినా వల్ల కావచ్చు. ఎనర్జిటిక్ గా ఉండటానికి కొన్ని రకాల డ్రింక్స్ బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే?
శరీరంలో స్టామినా, ఎనర్జీ లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ కారణాలు శారీరకంగా, మానసికంగా అలసిపోయిన భావన కలుగుతుంది. శారీరక కారణాలలో.. అనారోగ్యకరమైన ఆహారం, కంటినిండా నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం లేదా ఏదైనా అనారోగ్య సమస్య వల్ల ఇలా అవుతుంది. ఇకపోతే మానసిక కారణాల్లో ఆందోళన, ఒత్తిడి, నిరాశ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో అలసట, బలహీనతను తగ్గించుకోవడానికి హెల్తీ ఫుడ్ ను తినాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అయితే కొన్ని హెల్తీ పానీయాలతో కూడా మీరు రోజంతా ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉండొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.
ప్రోటీన్ షేక్
ఉదయం వ్యాయామం చేసిన తర్వాత లేదా ఏదైన పని చేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే ప్రోటీన్ షేక్ తాగండి. ఇది మీ కండరాలను మరమ్మత్తు చేయడానికి, శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మీ కండరాలను బలంగా చేస్తుంది . అలాగే మీలో కొత్త బలాన్ని తెస్తుంది.
కొబ్బరి నీరు
పొటాషియం పుష్కలంగా ఉండే కొబ్బరి నీల్లు సహజ ఎలక్ట్రోలైట్ పానీయం. ఇది మన శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీకు తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటుగా శరీరంలో నీటి కొరతను కూడా తీరుస్తుంది. కాబట్టి దీన్ని తాగితే మీకు తక్షణమే ఎనర్జీ వస్తుంది.
బీట్ రూట్ జ్యూస్
పోషకాలు మెండుగా ఉండే బీట్ రూట్ జ్యూస్ మీ స్టామినాను పెంచడానికి, రోగనిరోధక శక్తిని బలంగా చేయడానికి, రక్తపోటు వంటి సమస్యలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ ను తాగితే శరీరంలో రక్తం లోపం తగ్గిపోతుంది. దీనిలో ఉండే నైట్రేట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజూ మీరు బీట్ రూట్ జ్యూస్ ను తాగితే మీ స్టామినా బాగా పెరుగుతుంది.
స్మూతీలు
ఆకుకూరలు లేదా అవొకాడో వంటి పండ్లతో తయారు చేసిన స్మూతీలు మీకు మంచి శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా వీటిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు.
చెర్రీ జ్యూస్
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే చెర్రీ జ్యూస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ కండరాల నొప్పి ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే వ్యాయామం లేదా ఏదైనా భారీ శారీరక శ్రమ తర్వాత కూడా శక్తి, బలాన్ని పెంచుతుంది.