
ఉదయం లేవగానే మనలో చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అవి తాగకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్, తలనొప్పి తో ఇబ్బంది పడేవారు కూడా ఉంటారు. కానీ, ఈ టీ, కాఫీ లు తాత్కాలికంగా మాత్రమే శక్తిని ఇస్తాయి. దీర్ఘకాలంలో ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడే ప్రయోజనాలు ఏమీ ఈ టీ, కాఫీల్లో ఉండవు. ప్రయోజనాలు ఉండకపోగా నష్టాలు తెచ్చే అవకాశం ఉంది. అందుకే, వాటికి బదులుగా ఏదైనా సహజమైన, పోషకాలతో నిండిన పానీయం తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అటువంటి పానీయాల్లో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ముందు వరసలో ఉంటుంది.
బూడిద గుమ్మడికాయ కేవలం తక్కువ ఖర్చుతో దొరికే సాధారణ పానీయం మాత్రమే కాదు, ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, విటమిన్ B, విటమిన్ C వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధులను కూడా నివారించగలవు.
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల నరాలు శాంతిస్తాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. వ్యాపార ఒత్తిడి, పరీక్షల టెన్షన్, ఎమోషనల్ స్ట్రెస్. ఏదైనా కావచ్చు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల వీటన్నింటికీ సహజమైన పరిష్కారంగా పనిచేస్తుంది.
తెల్ల గుమ్మడికాయ రసం మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్లు, మూత్రంలో రక్తం రావడం, అల్సర్‌ల కారణంగా వచ్చే రక్తస్రావం, పైల్స్ వంటి సమస్యలకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. ఇది శరీరంలోని అంతర్గత భాగాలపై శీతలీకరణ ప్రభావాన్ని చూపించి, బాడీని డీటాక్స్ చేస్తుంది.
అల్సర్‌తో బాధపడేవారికి ఈ రసం తక్షణ ఉపశమనం ఇస్తుంది. దీనిని తేనెతో కలిపి తాగితే కడుపు లోపల తక్కువ సమయంలో శాంతి చేకూరుతుంది. ఇది ఆమ్లాన్ని తగ్గించి, కడుపు పొరను రక్షిస్తుంది. దీంతో జీర్ణ సంబంధిత ఇబ్బందులు కూడా తగ్గుతాయి.
బరువు తగ్గాలనుకునే వారు ఈ రసాన్ని రోజూ ఉదయం తీసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి, అదనపు నీరు, విషతుల్య పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది. దీని వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఎండాకాలంలో వడదెబ్బ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. అటువంటి సమయంలో బూడిద గుమ్మడికాయ రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, శరీరం తడిగా ఉంటుంది. ఇది హైడ్రేషన్‌ను మెరుగుపరచి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తేనెతో కలిపి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే, రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా, శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా ఉంటే.. ఈ జ్యూస్ తాగడం వల్ల ఆ సమస్యను తగ్గిస్తుంది. ఎనర్జీ పెరుగుతుంది. నీరసం సమస్య ఉండదు.
బూడిద గుమ్మడికాయ రసం అనేది మన ఇంట్లోనే సులభంగా లభించే, ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలను అందించే సహజ ఆరోగ్యకరమైన పానీయం. ఉదయం టీ, కాఫీ బదులు దీన్ని అలవాటు చేసుకుంటే, ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా, శక్తివంతమైన శరీరంతో రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. మొదట్లో తాగడానికి కాస్త కష్టంగా అనిపించొచ్చు. కానీ , రెగ్యులర్ గా తాగడం వల్ల అలవాటు అయిపోతుంది. దీనిని ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.