
ఫైబర్ ఆరోగ్యానికి చాలా అవసరమైన పోషకం. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అయితే చాలామంది రోజుకు ఎంత ఫైబర్ అవసరం ఉంటుందో.. అంత తీసుకోరు. దానివల్ల చాలారకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని కూరగాయలను మీ డైట్‌లో చేర్చుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
బ్రోకలీలో విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలోని సల్ఫోరాఫేన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్ని ఉడికించి లేదా పచ్చిగా సలాడ్లలో కలుపుకోవచ్చు. ఆవిరి మీద ఉడికించి తినడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.
పాలకూర.. ఐరన్, ఫైబర్‌తో నిండిన ఆకుకూర. ఇందులో ఐరన్, విటమిన్ A, విటమిన్ K, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. పాలకూర ఎముకల ఆరోగ్యానికి, రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.
క్యారెట్ ని అందరు ఇష్టంగా తింటారు. క్యారెట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ A గా మారుతుంది. విటమిన్ A కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. క్యారెట్‌లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను రక్షిస్తాయి.
అవకాడో.. మోనోశాచురేటెడ్ కొవ్వులు (ఆరోగ్యకరమైన కొవ్వులు), పొటాషియం, విటమిన్ K, విటమిన్ C, విటమిన్ B6, ఫోలేట్‌లకు మంచి మూలం. అవకాడో గుండె ఆరోగ్యానికి మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
చిలగడదుంప రుచికరమైన, పోషకమైన దుంప. ఇందులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండటానికి సహాయపడుతుంది.
వంకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా నాసునిన్ అనే ఆంథోసైనిన్.. మెదడు ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
మునగకాయలో విటమిన్ C, విటమిన్ A, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి సహాయపడతాయి.
పచ్చి బఠానీలు రుచికరమైనవి. వీటిలో ప్రోటీన్, విటమిన్ K, విటమిన్ C, ఫోలేట్ వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బఠానీలలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కరగని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ కూరగాయలను విడిగా వండుకోవచ్చు. లేదా వేరే వాటితో కలిపి తినచ్చు.