`లవకుశ` నాగరాజు ఇకలేరు

By Aithagoni RajuFirst Published Sep 7, 2020, 12:55 PM IST
Highlights

`లవకుశ` చిత్రంలో లవుడుగా నటించిన నాగరాజు ఇక లేరు. గతకొన్ని రోజులు శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ నటించిన `లవకుశ` చిత్రంలో లవుడుగా నటించిన నాగరాజు ఇక లేరు. గతకొన్ని రోజులు శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాగరాజు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

`భక్తరామదాసు` చిత్రంతో బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన నాగరాజు అసలు పేరు నాగేందర్‌రావు. ఇప్పటి వరకు దాదాపు 300చిత్రాలకుపైగా నటించి మెప్పించిన ఆయన `కీలుగుర్రం`, `హరిశ్చంద్ర` సినిమాల్లో నటించిన ఏవీ సుబ్బారావు కుమారుడు నాగరాజు కావడం విశేషం. 

1963లో వచ్చిన `లవకుశ` చిత్రంలో రాముడు పాత్రలో ఎన్టీఆర్, సీత పాత్రలో అంజలీదేవి, లవుడిగా నాగరాజు, కుశుడుగా నాగ సుబ్రమణ్యం, వాల్మీకి పాత్రలో చిత్తూరు నాగయ్య నటించగా, లక్ష్మణుడుగా కాంతారావు మెప్పించారు. సి.పుల్లయ్య,సి.ఎస్‌.రావు దర్శకత్వం వహించారు. ఘంటసాల సంగీతం అందించారు. అప్పట్లో పూర్తి కలర్‌లో షూటింగ్‌ జరుపుకున్న సినిమాగా నిలిచింది. 

`లవకుశ` సినిమా టైమ్‌లో నాగరాజు వయసు కేవలం పదకొండేళ్ళు. తండ్రినటుడిగా కావడం, అప్పటికే నాటకాల్లో అనుభవం ఆయన్ని లవుడి పాత్రకి ఎంపికయ్యేలా చేసింది. లవుడి పాత్రలో ఆయన ఒదిగిన విధానం అందరిచేతా శెభాష్‌ అనిపించుకుంది. 

అప్పట్లో ఈ సినిమా అమలాపురం సమీపంలోని ఈదరపల్లి శ్రీనివాసా థియేటర్‌లో రెండు వందల రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. ఎన్టీఆర్‌ నటవిశ్వరూపానికి, లవకుశులుగా నాగరాజు, నాగసుబ్రమణ్యం నటన తోడవ్వడంతో వెండితెరపై కాసుల పంట పండింది.

దీంతోపాటు `వెంకటేశ్వర మహత్యం`లో కృష్ణుడిగా సుబ్రమణ్యం నటించగా, పద్మావతిదేవి తమ్ముడిగా నాగరాజు నటించారు. ఇందులోనే తనదైన స్పెషాలిటీతో మెప్పించారు నాగరాజు. 

సినిమాల తర్వాత గత కొంతకాలంగా నాగరాజు హైదరాబాద్‌లోని ఓ అపార్ట్ మెంట్‌ వద్ద నిర్మించిన ఆలయంలో పూజారిగా పనిచేశారు. ఆ ఆలయం నుంచి వచ్చే కొద్దిపాటి సంపాదతోనే జీవితం సాగించారు. 

click me!