`ఆర్‌ఆర్‌ఆర్‌`కి మరో షాక్‌.. అల్లూరి చరిత్ర వక్రీకరిస్తున్నారంటూ హైకోర్ట్ లో పిటిషన్‌

By Aithagoni RajuFirst Published Jan 18, 2022, 8:33 AM IST
Highlights

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో చరిత్ర వక్రీకరణ జరిగిందని ఆయన తాజా ప్రకటనలో ఆరోపించారు.

ఓ వైపు వరుసగా విడుదల  వాయిదా పడుతూ డిజప్పాయింట్‌ చేస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి కోర్ట్ కేసులు మరో తలనొప్పిగా మారుతున్నాయి. ఈ చిత్ర కథలను వక్రీకరిస్తున్నారని కొన్ని సంఘాలు కోర్ట్ మెట్లు ఎక్కుతున్నాయి. తాజాగా స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్రని వక్రీకరిస్తే ఊరుకునేది లేదని అల్లూరి  యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు హెచ్చరించారు. సోమవారం ఆయన విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో చరిత్ర వక్రీకరణ జరిగిందని ఆయన తాజా ప్రకటనలో ఆరోపించారు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్‌ పోలీసుగా చూపడం దారుణమని పేర్కొన్నారు. ఈ విషయమై సినిమా మేకర్స్‌పై సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని వివరించారు. అల్లూరి, కొమరం భీమ్‌లు కలిసినట్టు చరిత్రలో లేదన్నారు.  ఇప్పటికైనా అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తొలగించాలని పడాల డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉంటే సినిమా విడుదల నిలిపివేయాలంటూ ఈనెల మొదటి వారంలో కోర్ట్ లో ఓ పిల్‌ దాఖలైంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విడుదలై స్టే విధించాలని అభ్యర్థిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాఖ్యం(పిల్‌) దాఖలు చేశారు. అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ చరిత్రలను `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు దాఖలు చేశారు. సినిమాకి సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వొద్దని కోరారు. 

అయితే ఈ పిటిషన్‌ని విచారణకు తీసుకుంది కోర్ట్. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయన్‌, జస్టిస్‌ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం విచారణకు తీసుకుంది. ప్రజాప్రయోజన వ్యాఖ్యం కావడం వల్ల విచారణకు తీసుకొవచ్చని జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ బెంచ్‌ వెల్లడించింది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ రావాల్సి ఉంది. ఇప్పటికే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జనవరి 7న విడుదల కావాల్సిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పుడు ఈ కేసులు మరింత ఇబ్బందిగా మారాయని చెప్పొచ్చు. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి రాజమౌళి దర్శకుడు. ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ దీనికి కథ అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాని నిర్మించారు. ఇందులో అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖనీ, ఒలివియా మోర్రీస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో భారీగా విడుదలకు ప్లాన్‌ చేశారు.

click me!