బంగాళాఖాతంలో అల్పపీడనం... ఆంధ్రాలో దంచికొట్టనున్న వర్షాలు

By Arun Kumar PFirst Published Oct 22, 2019, 2:22 PM IST
Highlights

బంగాళాఖాతంలో అకస్మాత్తుగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ ప్రభావంతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయట.  

విశాఖఫట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం అకస్మాత్తుగా ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రాను అతలాకుతలం చేయడానికి సిద్దంగా వున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు ఆంధ్రా ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు.రాయలసీమ, తెలంగాణలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం విశాఖ వాతావరణ కేంద్రం   తెలిపింది. 

ఉపరితర ప్రభావం విశాఖ జిల్లాలో అప్పుడే మొదలయ్యింది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పనులకే వెళ్లే పెద్దవాళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటితో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. 

ఈ వర్ష ప్రభావం మరో 48 గంటల్లో కొనసాగే అవకాశం వున్నట్లు సమాచారం. అల్పపీడన ప్రభావంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరిన్నిచోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇప్పటికే తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోంది. 4.5 కిలో మీటర్లు ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉత్తర ఇంటిరియర్‌ కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. 

దీంతో రాగల 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రా తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం.. దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. 

కోస్తా ఆంధ్రా, యానం, తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం వుందని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా నేడు, రేపు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
 

click me!