రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ అభ్యర్ధిని మార్చింది. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా అభ్యర్ధిని మార్చాల్సి వచ్చిందని జనసేన ప్రకటించింది.
కడప:సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరు శాసనసభ స్థానంలో అభ్యర్ధిని జనసేన మార్చింది. తొలుత ఈ అసెంబ్లీ స్థానం నుండి యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. క్షేత్రస్థాయి నుండి నివేదికల ఆధారంగా అభ్యర్ధిని మార్చాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానం నుండి అరవ శ్రీధర్ పేరును జనసేన ఖరారు చేసింది.
రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం, జనసేన నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పరిస్థితులపై చర్చించారు. అభ్యర్ధిని మార్చేందుకు చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. స్థానిక నేతల అభిప్రాయాలను విన్న తర్వాత యనమల భాస్కరరావు స్థానం అరవ శ్రీధర్ పేరును జనసేన ఖరారు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్ధులు బరిలోకి దిగారు.వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఐఎం కలిసి పోటీ చేయనున్నాయి.కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వందకు పైగా అసెంబ్లీ స్థానాలు, ఐదు ఎంపీ స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే.