Wriddhiman Saha: నిస్వార్థంగా దేశం కోసం ఆడినందుకు నాకు జరిగింది ఇది.. : వెటరన్ వికెట్ కీపర్ ఆవేదన

Published : Feb 20, 2022, 10:16 AM IST
Wriddhiman Saha: నిస్వార్థంగా దేశం కోసం ఆడినందుకు నాకు  జరిగింది ఇది.. : వెటరన్ వికెట్ కీపర్ ఆవేదన

సారాంశం

Wriddhiman Saha:  త్వరలో  శ్రీలంకతో జరుగబోయే  టెస్టు సిరీస్ లో స్థానం కోల్పోయిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా  తో ఓ ‘పేరు మోసిన జర్నలిస్టు’ దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే.. 

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ నీడన ఎదిగిన ఈ సీనియర్ వికెట్ కీపర్ ను త్వరలో శ్రీలంకతో జరుగబోయే  టెస్టు సిరీస్ నుంచి తప్పించింది బీసీసీఐ.  అయితే  ఈ నేపథ్యంలో అతడ్నుంచి ఇంటర్వ్యూ కోరిన ఓ జర్నలిస్టు.. సాహాతో దురుసుగా ప్రవర్తించాడు.   సాహా ఇలా చేయడం కరెక్ట్  కాదని.. ఈ విషయాన్ని తాను తేలికగా వదలబోనని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇప్పటికే జట్టులో స్థానం కోల్పోయిన సాహా.. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన సాహా.. ‘ఇన్నాళ్లు భారత క్రికెట్ కు సేవ చేసినందుకు గాను ఓ పేరు మోసిన జర్నలిస్టు నుంచి నాకు దక్కుతున్న గౌరవమిది.. జర్నలిజం విలువలు ఎక్కడికి పడిపోయాయో  అనేదానికి ఇది నిదర్శనం..’ అని ట్వీట్ చేశాడు. 

 

సాహా చేసిన ట్వీట్ లోని వాట్సాప్ స్క్రీన్ షాట్ లో సదరు జర్నలిస్టు (అతడి పేరును సాహా వెల్లడించలేదు).. అతడితో చేసిన చాట్ కింది విధంగా ఉంది. ‘నాతో ఇంటర్వ్యూ చేయి.. నీకు అది బాగా ఉపయోగపడుతుంది. వాళ్లు (బీసీసీఐ) ఒక వికెట్ కీపర్ ను ఎంచుకున్నారు. నువ్వు 11 మంది జర్నలిస్టులను ఎంపిక చేస్కో.. నాతో పోల్చితే వాల్లు వేస్ట్. నీకు  సాయం చేసేవాళ్లను ఎంచుకో..’ అని రాసుకొచ్చిన ఆ జర్నలిస్టు.. ఆ తర్వాత సాహాకు  వాయిస్ కాల్ కూడా చేశాడు. కానీ సాహా నుంచి ఎలాంటి స్పందనా లేదు. 

దీంతో కొద్దిసేపటికే మళ్లీ అతడే  చాట్ చేస్తూ.. ‘నువ్వు నాకు ఫోన్ చేయలేదు. నేను మళ్లీ నీతో ఇంటర్వ్యూ చేయను. నేను అవమానాలను అంత తేలికగా తీసుకోను. అంతేకాదు.. నేను దీనిని  గుర్తుంచుకుంటాను. నువ్వు ఇలా చేసి ఉండకూడదు..’ అని సాహాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. 

సాహాకు మొండిచేయి.. 

త్వరలో శ్రీలంకతో జరుగబోయే టెస్టు సిరీస్ కు  వృద్ధిమాన్ సాహాను  పక్కనబెట్టింది సీనియర్ సెలెక్షన్ కమిటీ.  సాహాతో పాటు ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ లకు కూడా చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో  సాహ.. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్  పై సంచలన ఆరోపణలు చేశాడు. 

సెలెక్షన్ తర్వాత స్థానిక మీడియాతో  సాహా మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడున్నంత (బీసీసీఐలో) కాలం నీకు జట్టులో డోకా లేదని దాదా (సౌరవ్ గంగూలీ) నాకు చెప్పాడు. ఆయన చెప్పిన ఆ మాటలు నాకు మానసిక బలాన్నిచ్చాయి. సౌతాఫ్రికాతో పర్యటనలో నేను ఎంపికైన కూడా మూడు  టెస్టులకు బెంచ్ మీదే ఉన్నా. దీంతో నేను షాక్ కు గురయ్యా. గంగూలీ నాకు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది.  ఒక టెస్టు సిరీస్ తో ఏం జరిగిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నా వయసు అయిపోతుందా..? లేక మరేమైనా సమస్యా..? నాకు తెలియదు..’ అని  అన్నాడు.

శ్రీలంకతో టెస్టు సిరీస్‌ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరబ్ కుమార్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన