నేను బీసీసీఐలో ఉన్నంతకాలం నీకేం డోకా లేదని చెప్పాడు, కానీ ఇప్పుడేమో : గంగూలీ, ద్రావిడ్ పై సాహ సంచలన వ్యాఖ్యలు

Published : Feb 20, 2022, 09:29 AM ISTUpdated : Feb 20, 2022, 09:32 AM IST
నేను బీసీసీఐలో ఉన్నంతకాలం నీకేం డోకా లేదని చెప్పాడు, కానీ ఇప్పుడేమో : గంగూలీ, ద్రావిడ్ పై సాహ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

Wriddhiman Saha Comments On Ganguly and Dravid: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. త్వరలో జరుగబోయే శ్రీలంక టెస్టు సిరీస్ కు ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో అతడు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ల మీద సంచలన ఆరోపణలు చేశాడు.

త్వరలో శ్రీలంకతో మూడు టీ20లతో పాటు  టెస్టు  సిరీస్ ఆడనున్న టీమిండియాలో స్థానం కోల్పోయిన వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్  సాహా.. తనను దారుణంగా అవమానించారని వాపోయాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తనను మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను బీసీసీఐలో ఉన్నంత కాలం జట్టులో తన స్థానానికి డోకాలేదని గంగూలీ చెప్పాడని.. కానీ ఇప్పుడేమో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని  ఆరోపించాడు. ఇక హెడ్ కోచ్ ద్రావిడ్ మీద కూడా పరోక్షంగా విమర్శలు కురిపించాడు సాహా.. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా  సెలెక్టర్లు సాహాను పక్కనబెట్టారు. ఈ విషయమై అతడికి ముందే  సమాచారమందించిన బీసీసీఐ సెలెక్టర్లు.. శనివారం దానిని అధికారికంగా ప్రకటించారు.

సెలెక్షన్ అనంతరం  సాహా స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్ (గతేడాది నవంబర్ లో) తో టెస్టులో నాకు మెడ నొప్పి ఉన్నా  ఆడి 61 పరుగులు సాధించాను. నేను ఇక్కడున్నంత కాలం నీకు జట్టులో డోకా లేదని దాదా (సౌరవ్ గంగూలీ) నాకు చెప్పాడు. ఆయన చెప్పిన ఆ మాటలు నాకు మానసిక బలాన్నిచ్చాయి. సౌతాఫ్రికాతో పర్యటనలో నేను ఎంపికైన కూడా మూడు  టెస్టులకు బెంచ్ మీదే ఉన్నా. దీంతో నేను షాక్ కు గురయ్యా. 

గంగూలీ నాకు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది.  ఒక టెస్టు సిరీస్ తో ఏం జరిగిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నా వయసు అయిపోతుందా..? లేక మరేమైనా సమస్యా..? నాకు తెలియదు..’ అని  సాహా అన్నాడు.

 

ద్రావిడ్ పరోక్షంగా అదే చెప్పాడు.. 

‘జట్టు నుంచి  బయటకు వచ్చాను కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పక తప్పదు. శ్రీలంక పర్యటనకు ముందే ద్రావిడ్ కూడా నాతో మాట్లాడాడు.   తదుపరి సిరీస్ లలో  నిన్ను ఎంపిక చేయకపోవచ్చుననే చర్చలు కూడా జరుగుతున్నాయి అని చెప్పాడు. ఏదో ఒక నిర్ణయం తీసుకోమని ద్రావిడ్ అన్నాడు. ఆ  నిర్ణయం రిటైర్మెంటే.. అదే విషయాన్ని ద్రావిడ్ పరోక్షంగా చెప్పాడు..’

చేతన్ శర్మ స్పష్టంగా.. 

‘శ్రీలంకతో టెస్టు సిరీస్ కోసం ఎంపిక ప్రక్రియ ప్రారంభమవడానికి కొద్ది రోజుల ముందు చేతన్ శర్మ (బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చీఫ్) నుంచి నాకు ఫోన్ వచ్చింది. నన్ను శ్రీలంక సిరీస్ కు ఎంపిక చేయడం లేదని  అతడు నాతో చెప్పాడు. అప్పుడు నేను.. ఒక్క శ్రీలంక సిరీస్ కేనా..? లేక తదుపరి సిరీస్ లకు కూడానా..? అని అడిగాను. దానికి చేతన్ కాసేపు ఆగి.. ఇకనుంచి నిన్ను పరిగణలోకి తీసుకోబోం..’  అని స్పష్టం చేశాడు. అయితే నేను చేతన్ ను కూడా అడిగాను. నన్ను డ్రాప్ చేయడానికి  నా ప్రదర్శన లేక వయసా..? అని ప్రశ్నించాను. దానికి శర్మ స్పందిస్తూ.. మేం  యువ ఆటగాళ్లను  ప్రోత్సహించాలని అనుకుంటున్నాం.. అని నాతో చెప్పాడు. అంతేగాక నన్ను రంజీలలో ఆడి నిరూపించుకోమని  కూడా సూచించాడు...’ 

వయసు సమస్య కాదు గానీ.. 

‘మేం వయసుకు పెద్దగా ప్రాధాన్యమివ్వమని చేతన్ శర్మ నాతో చెప్పాడు. కానీ యువకులు రాణిస్తున్నప్పుడు వారికి అవకాశాలివ్వడం మా బాధ్యత కదా.. అని అన్నాడు..’ అని  సాహా  తెలిపాడు. 

37 ఏండ్ల వయసున్న సాహా ను పక్కనబెట్టడానికే సెలెక్టర్లు నిర్ణయించుకున్నారనేది దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నుంచే వినిపిస్తున్న మాట.   సాహాతో పాటు ఇషాంత్ శర్మ, అజింక్యా రహానే, ఛతేశ్వర్  పుజారా లకు కూడా సెలెక్టర్లు శ్రీలంక సిరీస్ లో మొండి చేయి చూపించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో సాహా వికెట్ కీపర్ గా  స్థానం సంపాదించినా బెంచ్ కే పరిమితమయ్యాడు. రిషభ్ పంత్  అన్ని ఫార్మాట్లకు   ఆడుతుండటం..  భావి కెప్టెన్ గా అతడి పేరు వినిపిస్తుండటంతో పాటు యువ వికెట్ కీపర్లు చాలా మంది  జట్టులోకి వస్తుండటంతో సాహా ను పక్కనబెట్టింది సెలెక్షన్ కమిటీ.. 

భారత్ తరఫున 40 టెస్టులాడిన సాహా.. 1,353 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 30 గా ఉంది. ఇక వికెట్ కీపర్ గా 104 (92 క్యాచులు, 12 స్టంపులు) మందిని ఔట్ చేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన