IND vs SA: క్లాసెన్ కసిగా బాదెన్.. భారత్ మళ్లీ ఓడెన్.. రెండో టీ20 కూడా సఫారీలదే..

Published : Jun 12, 2022, 10:26 PM IST
IND vs SA: క్లాసెన్ కసిగా బాదెన్.. భారత్ మళ్లీ ఓడెన్.. రెండో టీ20 కూడా సఫారీలదే..

సారాంశం

IND vs SA T20I: తొలి టీ20లో ఓడినా రెండో మ్యాచ్ లో అయినా గెలవాలని కోరుకున్న భారత అభిమానులకు  టీమిండియా ఆటగాళ్లు నిరాశే మిగిల్చారు. బ్యాటింగ్ లో విఫలమైన భారత  ఆటగాళ్లు.. బౌలింగ్ లో కూడా విఫలమయ్యారు. 

వేదిక మారినా భారత జట్టు తలరాత మారలేదు.  బారాబతి స్టేడియంలో  బ్యాటింగ్ లో విఫలమైన టీమిండియా.. బౌలింగ్ లో కూడా  అదే వైఫల్యాన్ని ప్రదర్శించింది. రిషభ్ సేన నిర్దేశించిన  149 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా.. మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్ హైన్రిచ్ క్లాసెన్.. భారత బౌలర్లపై కసిగా బాదాడు. దొరికిన బంతిని దొరికినట్టుగా  స్టాండ్స్ లోకి పంపాడు.  అతడికి సఫారీ సారథి టెంబ బవుమా తో పాటు మిల్లర్ లో జతకలవడంతో సౌతాఫ్రికా సిరీస్ లో రెండో విజయం సాధించింది.  ఈ విజయంతో సిరీస్ లో దక్షిణాఫ్రికా 2-0  ఆధిక్యంలో నిలిచింది.  మూడో టీ20 జూన్ 14న విశాఖపట్నంలో జరుగుతుంది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో  చివరి బంతికి ఓపెనర్ హెండ్రిక్స్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో భువీ.. ప్రమాదకర ప్రిటోరియస్ (4) కూడా ఔట్ చేశాడు.  

భువీతో పాటు మరో ఎండ్ లో  అవేశ్ ఖాన్ కూడా కట్టడి చేయడంతో సౌతాఫ్రికాకు పరుగులు రాక కష్టమైంది. ఇక భువీ తన 3వ ఓవర్లో.. వాన్డెర్ డసెన్ (1) ను కూడా బౌల్డ్ చేశాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి సఫారీల స్కోరు 29 పరుగులకు 3 వికెట్లుగా ఉంది. 

అయితే డసెన్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన క్లాసెన్ (46 బంతుల్లో 81.. 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోయాడు. బవుమా (30 బంతుల్లో 35.. 4 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి అతడు  సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. చాహల్ వేసిన 9వ ఓవర్లో క్లాసెన్ 4, 6 బాదాడు. పది ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా.. 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. అప్పటికీ 60 బంతుల్లో 92 పరుగులు చేయాల్సి ఉంది. 

కానీ హార్ధిక్ వేసిన 11వ ఓవర్లో బవుమా ఒకటి, క్లాసెన్ రెండు ఫోర్లు బాదారు. దీంతో ఆ ఓవర్లో 13 రన్స్ వచ్చాయి.  ఆ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో.. 4, 6 బాదాడు క్లాసెన్. దీంతో నాలుగో వికెట్ కు 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం పూర్తైంది. ఆ తర్వాత బంతికే ఫోర్ బాది హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ రెండు ఓవర్లోనే సఫారీలు 32 పరుగులు పిండుకున్నారు. తర్వాత చాహల్ వేసిన 13వ ఓవర్లో తొలి బంతికే బవుమా ఫోర్ కొట్టినా.. తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 61 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  మరుసటి ఓవర్లో సింగిల్ తీసిన క్లాసెన్  కెరీర్ లో నాలుగో హాఫ్  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

బవుమా ఔటైనా  అద్భుతమేమీ జరుగలేదు. డేవిడ్ మిల్లర్ (15 బంతుల్లో 20 నాటౌట్) తో కలిపి క్లాసెన్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.చాహల్ వేసిన 16వ ఓవర్లో మూడో బంతికి మిల్లర్ సిక్సర్ బాది క్లాసెన్ కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస రెండు బంతుల్లో  అతడు బంతిని స్టాండ్స్ లోకి పంపాడు. ఆ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. అయితే  హర్షల్ వేసిన 18వ ఓవర్లో భారీ షాట్ ఆడి రవి బిష్ణోయ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కానీ అప్పటికే సఫారీల విజయం ఖాయమైంది. 

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్.. 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్ 3 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చినా వికెట్ తీయలేదు.యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్ లు తలా వికెట్ దక్కింది. కానీ చాహల్, అక్షర్ పటేల్ భారీగా పరుగులిచ్చుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?