
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు లార్డ్స్ లో జరిగిన తొలి టెస్టులో తడబడినా రెండో టెస్టులో మాత్రం నిలకడగా ఆడుతున్నది. తొలి ఇన్నింగ్స్ లో 145 ఓవర్లలో 553 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అతడు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ రికార్డును సమం చేశాడు. బౌల్ట్ సాధించిన ఈ రికార్డుతో ప్రపంచంలోని దిగ్గజ ఆటగాళ్లంతా అతడి తర్వాత స్థానంలో నిలిచారు. అయితే బౌల్ట్ సాధించిన రికార్డు బౌలింగ్ లో కాదు.. బ్యాటింగ్ లో...
కివీస్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 11వ నెంబర్ ఆటగాడిగా వచ్చిన బౌల్ట్.. 18 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో అతడు 11వ నెంబర్ బ్యాటర్ గా వచ్చి టెస్టులలో అత్యధిక పరుగులు (623) చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉండేది.
టెస్టు క్రికెట్ లో 11వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు :
1. ట్రెంట్ బౌల్ట్ : 78 ఇన్నింగ్స్ లలో 623 రన్స్
2. మురళీధరన్ : 98 ఇన్నింగ్స్ లలో 623
3. జేమ్స్ అండర్సన్ : 164 ఇన్నింగ్స్ లలో 609
4. గ్లెన్ మెక్ గ్రాత్ : 128 ఇన్నింగ్స్ లలో 603
5. కోట్నీ వాల్ష్ : 122 ఇన్నింగ్స్ లలో 553
దీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్:
ట్రెంట్ బ్రిడ్జిలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ దీటుగా బదులిస్తున్నది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్.. 145.3 ఓవర్లలో 553 పరుగులకు ఆలౌట్ అయింది. డారెల్ మిచెల్ (190) తృటిలో డబుల్ సెంచరీ మిస్ అవగా.. టామ్ బ్లండెల్ (106), కాన్వే (46), బ్రాస్వెల్ (49), విల్ యంగ్ (47) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. 67 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఓలీ పోప్ (123 నాటౌట్), జో రూట్ (63 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ అలెక్స్ లీస్ (67) రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఇంకా 290 పరుగులు వెనుకబడి ఉంది.