IND vs SA: కటక్ లో పరుగుల కటకట.. తడబడిన భారత్.. సౌతాఫ్రికా ముందు ఈజీ టార్గెట్..

Published : Jun 12, 2022, 08:44 PM IST
IND vs SA: కటక్ లో పరుగుల కటకట.. తడబడిన భారత్.. సౌతాఫ్రికా ముందు ఈజీ టార్గెట్..

సారాంశం

India vs South Africa 2nd T20I: ఢిల్లీలో జరిగిన తొలి టీ20 లో బ్యాటింగ్ లో దుమ్ము రేపిన భారత జట్టు కటక్ లో జరుగుతున్న  రెండో టీ20 లో పరుగులు తీయడానికే ఇబ్బందిపడింది. 

ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టీ20 లో రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు బ్యాటింగ్ లో తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు మన  ఆటగాళ్ల వైఫల్యంతో.. టీమిండియా భారీ స్కోరు చేయలేకపోయింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు తొలి ఓవర్లోనే రబాడ షాకిచ్చాడు.   అతడు వేసిన మొదటి ఓవర్లో ఐదో  బంతికి రుతురాజ్ గైక్వాడ్ (1)  కేశవ్ మహారాజ్ కు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రబాడాకు ఇది టీ20 లలో 50వ వికెట్.  

గైక్వాడ్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన  శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 40.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 34.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. నోర్త్జ్ వేసిన నాలుగో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన కిషన్.. ప్రిటోరియస్ వేసిన ఆరో ఓవర్లో కూడా  సిక్సర్ బాది  జోరు మీద కనిపించాడు. కానీ  జోరు మీదున్న ఇషాన్ ను నోర్త్జ్.. ఏడో ఓవర్లో నాలుగో బంతికి పెవిలియన్ కు పంపాడు. ఏడు ఓవర్లలో భారత్ 50 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. 

ఇషాన్ ఔటవడంతో అప్పటిదాకా ధాటిగా ఆడిన  అయ్యర్ కూడా నెమ్మదించాడు.  షంషీ వేసిన 9వ ఓవర్లో 4,6 తో  అయ్యర్ జోరుమీదున్నా.. ఆ తర్వాత ఓవర్ వేసిన కేశవ్ మహారాజ్ రిషభ్ పంత్ (5) ను ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత టీమిండియా కోలుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది.  13వ ఓవర్ వేసిన పార్నెల్.. హార్దిక్ పాండ్యా (9) ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే ప్రిటోరియస్ బౌలింగ్ లో శ్రేయస్ కూడా వికెట్ కీపర్ క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

 

ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ (10) కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 30.. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)... నోర్త్జ్ వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి భారత్ స్కోరును 130 దాటించాడు.  ఇక ప్రిటోరియస్ వేసిన చివరి ఓవర్లో 18 పరుగులు రావడంతో టీమిండియా స్కోరు 148 కి చేరింది. ఈ ఓవర్లో హర్షల్ పటేల్ ఓ ఫోర్ కొట్టగా.. దినేశ్ కార్తీక్ రెండు సిక్సర్లు బాది భారత్ కు గౌరవప్రద స్కోరును అందించాడు. 

దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్త్జ్ రెండు వికెట్లు తీయగా.. రబాడ, పార్నెల్, ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్ లు తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో నెగ్గాలంటే దక్షిణాఫ్రికా.. 20 ఓవర్లలో 149 పరుగులు చేయాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !