Paris Olympics 2024-Nikhat Zareen : ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో భారత్‌కు ఇప్పటి వరకు మూడు పతకాలు లభించగా, అవన్నీ కాంస్య పతకాలే. అయితే, ఈ సారి తాను ఎలాగైనా గోల్డ్ సాధిస్తానని ప్రపంచ ఛాంపియన్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ధీమాతో ఉన్నారు.
Paris Olympics 2024-Nikhat Zareen : పారిస్ ఒలింపిక్స్ 2024 కు సర్వం సిద్ధమైంది. జూలై 25 నుండి ఘనమైన వేడుకలతో ప్రారంభమయ్యే స్పోర్ట్స్ ఈవెంట్ లో భారతదేశం ఎలా డెలివర్ చేస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో కంటే పెద్ద సంఖ్యలో ఈ సారి క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 117 మంది అథ్లెట్లు ఈ పరీక్షకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో పక్కాగా పతకాలు గెలిచి భారత జెండాను ఎగురవేసే అథ్లెట్లు కూడా ఉన్నారు. వారిలో నిఖత్ జరీన్ కూడా ఒకరు. విశ్వక్రీడల్లో నిఖత్ జరీన్ కు ఇది తొలి ప్రదర్శన అయినప్పటికీ మెగా స్పోర్టింగ్ ఈవెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శనలను ఇవ్వడానికి ఆమె ఖచ్చితంగా అన్ని బాక్సింగ్ నైపుణ్యాలను కలిగి ఉంది.
ఇప్పటికే అంతర్జాతీయ ప్రధాన పోటీలలో అనేక ప్రశంసలు పొందడమే కాకుండా, నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలను కూడా సాధించింది. మొదటిది 2022లో 52 కేజీల విభాగంలో సాధించింది. ఈ ఘనత ఆమెను లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ స్థాయికి పెంచింది. ఆ తర్వాతి ఎడిషన్‌లో నిఖత్ మరో వెయిట్ కేటగిరీకి మారవలసి వచ్చింది. మార్పు ఉన్నప్పటికీ అసాధరణ ప్రదర్శనతో మళ్లీ గోల్డ్ గెలుచుకుంది. గత సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జరీన్ 50 కిలోల బరువు విభాగంలో పాల్గొంది. ఇప్పుడే అదే కేటగిరీతో పారిస్ 2024 ఒలింపిక్ లో పాల్గొననుంది. ఇప్పటి వరకు ఏ భారతీయుడు సాధించని ఫీట్‌ని లక్ష్యంగా చేసుకుని ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాలని జరీన్ ఎదురుచూస్తోంది.
విరాట్, రోహిత్ రిటైర్మెంట్.. టీమిండియాకు కష్టాలు.. !
అల్జజీరాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిఖత్ జరీన్ ను మన భారత బాక్సర్లతో పాటు లెజెండ్ మేరీకోమ్-తనకు మధ్య పోలిక గురించి అడగ్గా.. దానికి ఆమె ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మేరీ ఫీట్‌తో సరిపోలడం ఖచ్చితంగా కష్టమే, అయితే ఒలింపిక్ పతక పరంగా కనీసం లెజెండరీ పగ్లిస్ట్ కంటే ఒక అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. "ఆమె ఒక స్పూర్తి.. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్. నేను ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్ రికార్డును బద్దలు కొట్టగలనని నేను అనుకోను. నేటి కాలంలో దానిని ఛేజింగ్ చేయడం సాధారణ విషయం కాదు.. కానీ ఫైనల్‌కు చేరుకోవడానికి ఒలింపిక్స్‌లో నా వంతు ప్రయత్నం చేస్తాను.. మేరీ కోమ్, లవ్లినాలు కాంస్యం గెలిచారు.. ఈ సారి నేను పతకం రంగును మార్చాలనుకుంటున్నాను.. గోల్డ్ కొట్టడమే టార్గెట్" అని ఆమె చెప్పింది.
కాగా, ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించగా, అవన్నీ కాంస్యాలే. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో విజేందర్ సింగ్ కాంస్యం సాధించాడు. ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్ లో మేరీకోమ్, 2020 టోక్యో ఒలింపిక్స్ లో లవ్లీనా బోర్గోహైన్ కూడా ఇదే ఘనత సాధించారు.
Team India : టీమిండియా భవిష్యత్ ముగ్గురు మొనగాళ్లు.. !