Team India : టీమిండియా భవిష్యత్ ముగ్గురు మొనగాళ్లు.. !

By Mahesh Rajamoni  |  First Published Jul 17, 2024, 11:45 PM IST

Team India : ఇటీవల ముగిసిన ఇండియా-జింబాబ్వే టీ20 సిరీస్‌ను వ‌రుస విజ‌యాల‌తో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియా జ‌ట్టు అద్భుత ప్రదర్శన చేసింది. 
 


Team India : జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో తొలి మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓడిన భార‌త్.. ఆ త‌ర్వాత అద్భుతంగా పునరాగమనం చేసి, మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇందులో రెండు భారీ విజయాలు కూడా ఉన్నాయి. రెండో మ్యాచ్‌లో జింబాబ్వే 100 పరుగుల తేడాతో ఓడిపోగా, నాలుగో మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో చివరి మ్యాచ్‌లో టీమిండియా 42 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్ నుంచి భార‌త్ కు ముగ్గురు భ‌విష్య‌త్ స్టార్లు ల‌భించార‌ని టీమిండియా డాషింగ్ ఓపెనింగ్ బ్యాట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు. 

ఐపీఎల్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో బౌలర్లను మట్టికరిపించిన యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ.. ఈ సిరీస్‌లో టీమిండియాకు అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. భారీ అంచ‌నాలున్న అత‌ను మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు, కానీ తన రెండవ మ్యాచ్‌లో అద్భుత‌ సెంచరీతో అద‌ర‌గొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే ఈ సెంచరీని సాధించాడు. తర్వాతి మ్యాచుల్లో బ్యాటింగ్ చేయకపోయినా అతడి బ్యాటింగ్ ప్రతిభ చూస్తుంటే భార‌త జ‌ట్టు ఫ్యూచర్ స్టార్ అతనే అని చెప్పొచ్చు.

Latest Videos

24 ఏళ్ల ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్‌లో సమర్థవంతమైన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన పరంగా ముఖేష్ కుమార్‌తో కలిసి నిలిచాడు. ఈ బౌలర్లిద్దరూ 8-8 వికెట్లు తీశారు. టీ20 ఫార్మాట్ నుంచి రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుందర్ జట్టులో కొనసాగిస్తే జడేజాకు అతనే గొప్ప ప్రత్యామ్నాయం కాగలడు. సుందర్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. 

ఖలీల్ అహ్మద్‌కు సిరీస్‌లో మూడు వికెట్లు మాత్ర‌మే తీసి ఉండవచ్చు, కానీ అతను తన కచ్చితత్వంతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. టీ20 ప్రపంచ కప్ కోసం భారత రిజర్వ్ ఆటగాళ్లలో ఉన్న ఖలీల్ అహ్మద్ 2018లో ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ తర్వాత డ్రాప్ అయ్యాడు. ఇక ఐపీఎల్ 2024లో తన అద్భుతమైన బౌలింగ్‌తో పునరాగమనం చేసాడు. ఇప్పుడు టీ20లో భార‌త జ‌ట్టుకు కీల‌కంగా మార‌గ‌ల‌డు. 

శ్రీలంక పర్యటనకు చోటు దక్కుతుందా?

ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక టూర్‌లో ఈ ముగ్గురు స్టార్లు జట్టులో స్థానం సంపాదించడం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే, సెలెక్టర్లు అవ‌కాశ‌మిస్తారా లేదా సీనియ‌ర్ల వైపు చూస్తారా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. త్వరలో శ్రీలంక పర్యటనకు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. టీ20, వన్డే సిరీస్‌లు ఆడనున్న టీమ్‌ఇండియాకు ఎవరు నాయకత్వం వహిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

click me!