Rohit Sharma-Sunil Gavaskar : 5 ఐపీఎల్ టైటిళ్లను అందించిన రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ హార్దిక్ ప్యాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ముంబై ఎప్పుడూ ఫ్రాంఛైజీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నాడు.
Rohit Sharma-Hardik Pandya-Sunil Gavaskar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కు సర్వం సిద్దమవుతోంది. ఐపీఎల్ 2024 సీజన్ కు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. అయితే, ఐపీఎల్ 2024 వేలానికి ముందు ట్రేడ్ విండోలో 10 ఫ్రాంచైజీలలో చోటుచేసుకున్న అంశాల్లో హార్దిక్ పాండ్యా అంశం ఇప్పటికీ హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఎంట్రీలోనే ఐపీఎల్ టైటిట్ అందించడంతో పాటు రెండో సారి గుజరాత్ కు ఫైనల్ కు చేర్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఆ జట్టు వదులుకుంది.
ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ.. హార్దిక్ ప్యాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని అప్పగించింది. రూ.15 కోట్లతో ఈ డీల్ ను చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ముంబై ప్రకటించడం సంచలనం రేపింది. తాజాగా ఇదే అంశంపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు.
స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ఫ్రాంచైజీ భవిష్యత్తు గురించే ఆలోచిస్తుందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్ గా ఉండాల్సిన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం వల్ల రోహిత్ శర్మకు కొంత పని భారం నుంచి ఉపశమనం లభిస్తుందని అన్నారు.
'ఫ్రాంఛైజీ భవిష్యత్తు గురించి ముంబై ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటికే 36 ఏళ్ల రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు భారత కెప్టెన్ గా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఆ భారాన్ని కొంత తగ్గించి ఆ బాధ్యతను హార్దిక్ పాండ్యా భుజస్కంధాలపై వేయడానికి ప్రయత్నించారు' అని సునీల్ గవాస్కర్ అన్నారు. హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అప్పగిస్తే రోహిత్ శర్మకు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుందని అన్నాడు. దీంతో ఈ సీజన్ లో హార్దిక్ నాయకత్వంలోని ముంబై జట్టు నిలకడగా రాణిస్తే 200కు పైగా స్కోర్లు నమోదు చేసే అవకాశముందన్నాడు.
''హార్దిక్ పండ్యాకు కెప్టెన్సీ అప్పగిస్తే ముంబై ఇండియన్స్ కు మేలు జరుగుతుంది. ఇప్పుడు టాప్ ఆర్డర్ లోకి వెళ్లి స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛను రోహిత్ శర్మకు ఇచ్చారు. అప్పుడు హార్దిక్ నెం.3 లేదా నెం.5లో వచ్చి నిలకడగా 200కు పైగా స్కోర్లు సాధించడంలో సహాయపడగలడు'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.