
వాంఖడే స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న ముంబై అగ్రెసివ్‌గా ముందుకు వెళ్తోంది. ముంబై బౌలింగ్ దాటికి కోల్‌కతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే కెప్టెన్ అజింక్య రహానే అవుట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అశ్వని కుమార్ వేసిన బంతికి అజింక్య రహానే అద్భుతమైన షాట్ ఆడాడు. అయితే బౌండరీ వద్ద ఉన్న తిలక్ వర్మ అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు.
తొలుత క్యాచ్ మిస్ అయినా మరో చేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'క్యాచ్ అలా ఎలా పట్టేశావ్ భయ్యా' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వికెట్ తీసుకున్న అశ్వని కుమార్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అశ్వని కుమార్ ఈ మ్యాచ్ ద్వారానే అరంగేట్రం చేశాడు.
మొదటి బంతికే వికెట్ తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. 2025 మెగా వేలంలో ఫ్రాంచైజీ అశ్విని కుమార్‌ను రూ. 30 లక్షలకు దక్కించుకుంది. అతను గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో కూడా ఉన్నాడు. కానీ, ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేదు. తాజాగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోపరుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.