ఐపీఎల్ 2025 : బీసీసీఐ నిర్ణ‌యంతో ధోనికి షాక్ - చెన్నై సూప‌ర్ కింగ్స్ కు లాభమేంటి?

By Mahesh RajamoniFirst Published Sep 29, 2024, 10:42 PM IST
Highlights

IPL 2025 : బీసీసీఐ ఐపీఎల్ 2025 కోసం ప్లేయర్ రిటెన్షన్ నియమాలను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 8 విషయాలు వుండ‌గా, వీటిలో 7వ నియమం ప్రత్యేకంగా  ఎంఎస్ ధోనికి సంబంధించినదని చెప్ప‌వ‌వ‌చ్చు. ఇప్పుడు ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు అంటిపెట్టుకోగ‌ల‌దు. 
 

IPL 2025 - MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్లు మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లుగా ఉంచడానికి అనుమతించే నియమాన్ని తిరిగి తీసుకువచ్చింది. ఐపీఎల్ 2024 ముగిసిన త‌ర్వాత ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చిన పేరు ఎంఎస్ ధోని. ఎందుకుంటే ఈ సీజ‌న్ లో ధోని చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. కేవ‌లం ప్లేయ‌ర్ గానే ఆడాడు. ఇదే చివ‌రి ఐపీఎల్ అనే చ‌ర్చ కూడా సాగింది. ఐపీఎల్ 2025 ఆడ‌తాడా?  లేదా? అనే ఉత్కంఠ ఇప్ప‌టికీ ఉంది. కానీ, బీసీసీఐ తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో ధోనిని చెన్నై సూప‌ర్ కింగ్స్ రిటెన్ష‌న్ ప్లేయ‌ర్ల‌లో త‌మ‌తోనే అంటుపెట్టుకునేందుకు అవకాశం ఏర్పడింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణ‌యాలు చెన్నై జ‌ట్టుకు లాభం  చేకూర్చాయ‌ని చెప్పాలి. ఇప్పుడు ధోని సీఎస్కేలో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జ‌ట్టుతోనే ఉండనున్నాడు. 

 

ఐపీఎల్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్ ఏమిటి? 

Latest Videos

ఈ నియమం మొదట 2008లో అమలులోకి వచ్చింది కానీ 2021లో రద్దు చేశారు. మ‌ళ్లీ ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం ఈ రూల్ ను తీసుకువ‌స్తున్నారు. సీజన్ ప్రారంభానికి ముందు కనీసం ఐదు సంవత్సరాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న భారతీయ క్రికెటర్లకు ఇది వర్తిస్తుంది. దాదాపు ప్రతి సీజన్‌లో ఐపీఎల్ లో అనేక మంది అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌ని ప్లేయ‌ర్లు ఆడుతున్నారు. వీరిని అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా పేర్కొంటున్నారు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా ఐపీఎల్ లో కొన‌సాగేందుకు క్రికెట‌ర్ల కోసం బీసీసీఐ ఈ రూల్ తీసుకువ‌చ్చింది. 

 

 

అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్ ఈ నియమం ప్రకారం సంబంధిత సీజన్ జరిగే సంవత్సరానికి ముందు గత ఐదు క్యాలెండర్ సంవత్సరాల్లో ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో జ‌ట్టు త‌ర‌ఫున ప్లేయింగ్ 11 లో భాగం కాకపోయినా లేదా బీసీసీఐ తో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగి ఉండకపోయినా క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ అన్‌క్యాప్ చేయబడతాడు. ఈ నిబంధన కేవలం భారత ఆటగాళ్లకు మాత్రమే. ఐపీఎల్ 2025 ఎడిష‌న్ మెగా వేలానికి ముందు బీసీసీఐ తీసుకున్న నిర్ణ‌యాల్లో ఐపీఎల్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ రిటెన్షన్ నియమాన్ని మ‌ళ్లీ తీసుకువ‌చ్చింది. 

 

బీసీసీఐ నిర్ణ‌యంతో చెన్నై టీమ్ కు లాభం - ధోనికి న‌ష్టం ఏమిటి? 

 

ఐపీఎల్ 2025 కి ముందు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లపై చర్చల సమయంలో ఈ  నియమాన్ని పునరుద్ధరించడం గురించి ఫ్రాంచైజీలకు బీసీసీఐ చెప్పింది. ప్లేయ‌ర్ల రిటెన్ష‌న్ లో కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉంటారు. "అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడకుండా లేదా BCCIతో సెంట్రల్ కాంట్రాక్టును కలిగి ఉండకపోతే, సంబంధిత సీజన్ జరిగే సంవత్సరానికి ముందు ఐదు క్యాలెండర్ సంవత్సరాలలో క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ అన్‌క్యాప్ చేయబడతాడని" బీసీసీఐ పేర్కొంది. 

దీంతో ఇప్పుడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీని సీఎస్కే త‌మ వ‌ద్ద‌నే ఉంచుకుంటుంది. ఐపీఎల్ 2022 ఎడిష‌న్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు రూ.12 కోట్లకు త‌మ వ‌ద్ద ఉంచుకుంది. అయితే, సీఎస్కే ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఇప్పుడు బోర్డులో ఉంచాలని నిర్ణయించుకుంటే అత‌ను అందుకునే వేత‌నం రూ.4 కోట్లకు పడిపోతుంది. ఎందుకంటే ధోని ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప‌లికాడు. 2020 నుంచి అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. బీసీసీఐ తో ఎలాంటి ఒప్పందాలు లేవు. కాబట్టి ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్ లిస్టులోకి వ‌స్తాడు. దీంతో ప్ర‌స్తుతం అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అందుకుంటున్న అధిక వేతనం రూ.4 కోట్లు. కాబ‌ట్టి ధోని ధ‌ర రూ.12 కోట్ల నుంచి రూ.4 కోట్ల‌కు ప‌డిపోతుంది.

 

ధోని ఐపీఎల్ 2025 లో ఆడతాడా?  లేదా?

 

ఐపీఎల్‌లో ఎంఎస్ ధోని భవితవ్యం గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారింది. 2023లో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత అతను 2024 సీజన్ లో ఆడ‌తాడా?  లేడా? అనే సందిగ్దం ఉంది. అయితే, మొత్తానికి ఐపీఎల్ 2024 లో చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ తో క‌నిపించాడు. కానీ, త‌న కెప్టెన్సీని వ‌దులుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు సీఎస్కే కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ గా ధోని గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో క‌నిపించాడు. 

బ్యాట్‌తో ధోని పాత్ర కూడా పరిమితంగానే ఉంది. చివ‌ర‌లో బ్యాటింగ్ కు వ‌చ్చాడు. చాలా త‌క్కువ బంతుల‌ను ఆడాడు. అయితే, బ్యాటింగ్ కు చివ‌ర‌లో వ‌చ్చినా ధోని త‌న‌దైన బౌండరీ-హిట్టింగ్ షాట్ల‌తో ఆల‌రించాడు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో ధోనీ క్రికెట్ భవిష్యత్తు గురించి ప్ర‌శ్నించ‌గా, రాబోయే ఐపీఎల్ సీజ‌న్ ఆడ‌టం, ఆడ‌క‌పోవ‌డం అనే విష‌యాల‌ను స్ప‌ష్టం చేయ‌లేదు. కానీ, త‌న నిర్ణ‌యం తీసుకునే ముందు ప్లేయర్ రిటెన్షన్ కు సంబంధించి బీసీసీఐ తీసుకునే నిర్ణ‌యాల కోసం వేచిచూస్తున్నాన‌ని తెలిపాడు. మ‌రి ఇప్పుడు ధోని ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌నే ఉత్కంఠలో క్రికెట్ ల‌వ‌ర్స్ ఉన్నారు.

కాగా, ధోని ఐపీఎల్ లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్, చెన్నై సూప‌ర్ కింగ్స్ రెండు జ‌ట్ల త‌ర‌ఫున ఆడాడు. 2016, 2017 ఐపీఎల్ సీజ‌న్ల‌లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ త‌ర‌ఫున ఆడిన ధోని మిగ‌తా సీజ‌న్ల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. చెన్నై టీమ్ ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాడు. సీఎస్కేను విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా ముందుకు న‌డిపించాడు. ఐపీఎల్ లో 264 మ్యాచ్ ల‌ను ఆడిన ధోని 5243 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్ లో ధోని వ్య‌క్తిగ‌త అత్య‌ధిక స్కోరు 84 ప‌రుగులు నాటౌట్. అలాగే, 24 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు.

click me!