ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఆరంభంలోనే డిల్లీ టీం కు షాక్ తగిలింది. ఏకంగా రూ.14 కోట్ల వెచ్చించి కొనుగోలు చేసిన స్టార్ ఆటగాడు విశాఖపట్నంలో జరుగుతున్న తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మరో ఉత్కంఠభరిత పోరుకు విశాఖపట్నం వేదికయ్యింది. డిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జాయింట్స్ మధ్య విశాఖపట్నం వేదికగా మ్యాచ్ ప్రారంభిమయ్యింది. అయితే లక్నోతో తలపడుతున్న తొలి మ్యాచ్ కు కీలక ఆటగాడు కెఎల్ రాహుల్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ మ్యాచ్ ఆడటంలేదు. ఏకంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన కీలక ఆటగాడు ఆడకపోవడం డిల్లీ టీం కు షాక్ అనే చెప్పాలి.
అయితే టాస్ డిల్లీకి అనుకూలంగా వచ్చింది... ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా టాస్ ఓడిన లక్నో బ్యాంటింగ్ కు దిగింది.
ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ప్రత్యేకంగా నిలిచారు. ఎందుకంటే గత తొమ్మిదేళ్లుగా డిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన అతడు ప్రస్తుతం లక్నో కెప్టెన్ గా మారాడు. ఎల్ఎస్జి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి డిల్లీతోనే ఆడటం విశేషం.
లక్నో సూపర్ జెయింట్స్ టీం ను గాయాలు వెంటాడుతున్నాయి. ఈ జట్టులోని కీలక బౌలర్లు మోహ్సిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, మయాంక్ యాదవ్ గాయాలతో సతమతం అవుతున్నారు. దీంతో మోహ్సిన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి చేర్చుకున్నారు.
టాస్ గెలిచిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ "మేము మొదట బౌలింగ్ చేయబోతున్నాం. విశాఖలో మంచు ప్రభావం ఉండనుంది కాబట్టి మేము రిస్క్ తీసుకోకూడదనుకుంటున్నాము. అందుకే మేము మొదట బౌలింగ్ చేస్తున్నాము. నేను ఇంతకు ముందు పంత్ తో ఆడాను; అతనికి నేను తెలుసు, నాకు అతను తెలుసు. మా వ్యూహాలు మాకు తెలుసు. నేను క్యాపిటల్స్ కోసం చాలా ఆడాను; మాకు బాగా బ్యాలెన్స్డ్ టీమ్ ఉంది. నేను మూడు సంవత్సరాలుగా డీసీతో ఉన్నాను... కానీ ఇప్పుడు నేను నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి నేను దాని ప్రకారం పని చేయాలి. ఒక నాయకుడిలా ఆలోచించాలి. ఫాఫ్ డు ప్లెసిస్, స్టబ్స్, స్టార్క్, ఫ్రేజర్ మెక్ గుర్క్ మా నలుగురు విదేశీ ఆటగాళ్ళు తుది జట్టులో ఉన్నారు" అని తెలిపారు.
ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా తన మాజీ జట్టును ఎదుర్కోవడం గురించి మాట్లాడాడు. అలాగే టాస్ పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "నేను మొదట బౌలింగ్ చేయాలనుకున్నాను కానీ ఇది మంచి వికెట్ కాబట్టి మేము బాగా బ్యాటింగ్ చేయవచ్చు, మంచి స్కోరును నిలబెట్టవచ్చు. నేను ఇంతకాల డీసీ కోసం ఆడాను, కాబట్టి అక్కడ చాలా భావోద్వేగాలు ఉన్నాయి. సన్నాహాలు బాగా జరిగాయి, ప్రతి ఒక్కరూ సరైన ఆకృతిలో, సరైన మనస్తత్వంలో ఉన్నారు. మార్క్రమ్, మార్ష్, పూరన్, మిల్లర్ మా నలుగురు విదేశీ ఆటగాళ్ళు." అని పంత్ చెప్పాడు.
తుది జట్లు ఇవే :
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ ఎలెవన్): జేక్ ఫ్రేజర్-మెక్ గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ ఎలెవన్): ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్. (ఏఎన్ఐ)