Ind vs SL: మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చినా ‘తగ్గేదేలే’ అంటున్న జడ్డూ..

Published : Feb 25, 2022, 10:59 AM IST
Ind vs SL: మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చినా ‘తగ్గేదేలే’ అంటున్న జడ్డూ..

సారాంశం

Ravindra Jadeja Pushpa Style Celebrations: లక్నో వేదికగా శ్రీలంకతో గురువారం ముగిసిన తొలి టీ20లో వికెట్ కీపర్ దినేశ్ చండిమాల్ ను ఔట్ చేయగానే జడ్డూ వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. 

టీమిండియా ఆల్ రౌండర్  రవీంద్ర జడేజా.. మూడు నెలల పాటు గాయంతో క్రికెట్ కు దూరమయ్యాడు. గతేడాది న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడ్డ  అతడు.. దక్షిణాఫ్రికా పర్యటనతో పాటు ఇటీవల ముగిసిన విండీస్ తో సిరీస్ కూడా ఆడలేదు. కానీ గురువారం లక్నో వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన మూడు మ్యాచుల టీ20 సిరీస్ కు రీఎంట్రీ ఇచ్చాడు. లంకతో తొలి టీ20 సందర్భంగా  బ్యాటింగ్ లో పెద్దగా మెరుపులు మెరిపించని జడ్డూ (జడేజా ముద్దుపేరు)..  బౌలింగ్ లో మాత్రం అదరగొట్టాడు.  లంక వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్  దినేశ్ చండిమాల్ వికెట్ తీయగానే పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే..’ స్టైల్ ను  అనుకరించాడు. 

పుష్ప సినిమా విడుదలై మూడు నెలలు గడిచినా ఆ ఫీవర్ మాత్రం ఇంకా నెటిజన్లను వీడటం లేదు. ఇప్పటికీ సోషల్ మీడియలో ఈ సినిమాలోని డైలాగులు, పాటలు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. కాగా.. ఈ సినిమాలోని ‘తగ్గేదేలే’ (హిందీలో  మై జుకేగా నహి)  అంటూ గడ్డాన్ని నిమురుతూ  అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ అయితే ఎంతో పాపులర్ అయింది.  ఎంతో మంది  క్రికెటర్లు ఈ డైలాగ్ ను టిక్ టాక్, ఇన్ స్టాలో కాపీ కొట్టి విపరీతమైన క్రేజ్ పొందారు. 

 

టీమిండియాలో ‘తగ్గేదే లే’ డైలాగ్ ను మొదటిసారిగా ఇమిటేట్ చేసిన రవీంద్ర జడేజా.. ఇప్పుడు తాజాగా శ్రీలంకతో సిరీస్ లో కూడా మళ్లీ దానిని రిపీట్ చేశాడు.  లంక ఇన్నింగ్స్ లో పదో ఓవర్ వేసిన జడ్డూ బౌలింగ్ లో.. చండిమాల్ ముందుకొచ్చి ఆడాడు. కానీ అది కాస్తా మిస్సవడంతో వికెట్ల వెనుక ఉన్న ఇషాన్ కిషన్  బంతిని అందుకని  మరో ఆలోచన లేకుండా స్టంపౌట్ చేశాడు. దీంతో జడేజా.. గడ్డాన్ని నిమురుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

ఇక మ్యాచు  విషయానికొస్తే టాస్ ఓడి తొలుత  బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన.. లంక బౌలర్లను ఆటాడుకుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (44) ధాటిగా ఆడగా..  యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తుఫాను సృష్టించాడు. 56 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్సులో 10 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి.  ఈ ఇద్దరికి తోడు శ్రేయస్ అయ్యర్ (57) కూడా ఆఖర్లో రాణించాడు. ఈ ముగ్గురు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా.. 2 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 

 

అనంతరం  బ్యాటింగ్ కు దిగిన  లంక.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.  చరిత్ అసలంక (53), దుష్మంత చమీర (24) లు రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది లంక.. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్.. 2 ఓవర్లలో తొమ్మిది  పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. వెంకటేశ్ అయ్యర్ కు కూడా రెండు వికెట్లు దక్కాయి. జడేజా 4 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా పడగొట్టాడు. చాహల్ కూడా ఒక వికెట్ దక్కించుకుని పొదుపుగా బౌలింగ్ చేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అయ్యర్, చాహల్‌ను అందుకే పక్కనపెట్టాం.. నిజాన్ని చెప్పేసిన హిట్‌మ్యాన్..
దెబ్బ మీద దెబ్బ.. టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాలో టెన్షన్.. టెన్షన్..