Ishan Kishan: ఆ ముగ్గురి వల్లే నేనిలా ఉన్నా.. టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Feb 25, 2022, 11:52 AM IST
Ishan Kishan: ఆ ముగ్గురి వల్లే నేనిలా ఉన్నా.. టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

India vs Srilanka T20I's: భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వీర విధ్వంసం సృష్టించాడు. విండీస్ తో సిరీస్ లో అనుకున్న స్థాయిలో రాణించని అతడు.. నిన్నటి మ్యాచులో మాత్రం.. 

టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గురువారం లంకతో జరిగిన తొలి టీ20లో  సంచలన ఇన్నింగ్స్ తో  దుమ్మురేపాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ తో 56 బంతుల్లోనే 89 పరుగులు చేసి  తృటిలో సెంచరీ కోల్పోయాడు. రోహిత్ శర్మతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన  ఇషాన్.. తన ఆటకు జట్టులోని సీనియర్ల సహకారం చాలా ఉందని అన్నాడు. లంకతో తొలి టీ20  అనంతరం ఇషాన్ కిషన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విండీస్ తో టీ20 సిరీస్ లో అనుకున్న స్థాయిలో రాణించని కిషన్ (మూడు మ్యాచులలో 71 పరుగులు).. నిన్నటి మ్యాచులో  మాత్రం అదరగొట్టాడు.

కిషన్ మాట్లాడుతూ.. ‘‘జట్టులోని సీనియర్ ఆటగాడు ఎవరైనా కొత్తగా వచ్చిన జూనియర్ ఆటగాడు బాగా రాణించాలని కోరుకుంటాడు. నా విషయానికొస్తే   కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ  సారథి విరాట్ కోహ్లిలు నాకు విలువైన సూచనలిచ్చారు.  మేము (యువ ఆటగాళ్లు)   సరిగా ఆడనప్పుడు మమ్మల్ని ఎలా మోటివేట్ చేయాలో వాళ్లకు బాగా తెలుసు.. 

 

నేను వెస్టిండీస్ సిరీస్ లో సరిగా రాణించలేదు. కానీ వాళ్లు (రోహిత్, రాహుల్, కోహ్లి) మాత్రం నా సామర్థ్యంపై ఎప్పుడూ  అపనమ్మకంతో లేరు. నా టాలెంట్ ను గుర్తించి.. నా సేవలు జట్టుకు ఏ విధంగా ఉపయోగకరమో చెబుతారు..‘మేం నిన్ను నమ్ముతున్నాం. నీ సామర్థ్యంపై మాకు సందేహమేమీ లేదు..’ అని చెప్పారు. ఆ మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. చిన్న చిన్న విషయాలలో నాకు సూచనలు చెప్పి నా బ్యాటింగ్ మెరుగవడానికి ఎంతో సహకరించారు..’ అని అన్నాడు. 

ముఖ్యంగా తన బ్యాటింగ్, స్ట్రైక్ రేట్ మెరుగవడానికి రోహిత్ శర్మ ఎంతో సహకారం అందించాడని, అతడు చెప్పిన టిప్స్ ను పాటించానని  కిషన్ చెప్పాడు. ‘రోహిత్ భాయ్ నాకు విలువైన టిప్స్ చెప్పాడు. హిట్టింగ్ ఎంత చేసినప్పటికీ స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంతో ముఖ్యమని రోహిత్ భాయ్ నాతో అన్నాడు. నెట్స్ లో  ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన  విషయాలనే  నేను మ్యాచులో ఇంప్లిమెంట్ చేశాను.  గురువారం నాటి  మ్యాచులో కూడా రోహిత్ నుంచి నాకు పూర్తి మద్దతు లభించింది..’ అని అన్నాడు. 

ఇక నిన్నటి మ్యాచులో.. టాస్ ఓడి తొలుత  బ్యాటింగ్ కు దిగిన రోహిత్ సేన.. లంక బౌలర్లను ఆటాడుకుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (44) ధాటిగా ఆడగా.. ఇషాన్ కిషన్ తుఫాను సృష్టించాడు. 56 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్సులో 10 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి.  ఈ ఇద్దరికి తోడు శ్రేయస్ అయ్యర్ (57) కూడా ఆఖర్లో రాణించాడు. ఈ ముగ్గురు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా.. 2 వికెట్లకు 199 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం  బ్యాటింగ్ కు దిగిన  లంక.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.  చరిత్ అసలంక (53), దుష్మంత చమీర (24) లు రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది లంక.. ఫలితంగా భారత జట్టు.. 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన