
టీమిండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటన కోసం సిద్ధమవుతున్నాడు. రెండేండ్లుగా సెంచరీ చేయకపోవడం.. ఇటీవల బీసీసీఐ తో కోహ్లీ వివాదాలు.. ఈ నేపథ్యంలో అతడికి ఈ పర్యటన కీలకం కానున్నది. ఈ మేరకు కోహ్లీ కూడా నెట్స్ లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. అయితే ప్రాక్టీస్ సందర్భంగా.. టీమిండియా సారథి భారీ కిట్ బ్యాగ్ మోసుకొస్తాడు. అసలు అందులో ఏముంటాయి..? ఇప్పటికే తీరిక లేని క్రికెట్ ఆడుతూ పనిభారంతో సారథ్య బాధ్యతలు మోస్తున్న కోహ్లీ భుజాలపై ఉన్న భారీ కిట్ బ్యాగ్ లో అతడు ఏమేం వస్తువులు మోసుకెళ్తాడు..?
ఈ ప్రశ్నకు సమాధానం స్వయంగా విరాట్ కోహ్లీనే వెల్లడించాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ వీడియోను విడుదల చేసింది. అందులో కోహ్లీ.. స్వదేశంలో గానీ, విదేశాలకు వెళ్లినప్పుడు గానీ కోహ్లీ తన కిట్ బ్యాగ్ లో ఏమేం క్యారీ చేస్తాడో స్వయంగా తెలిపాడు.
ఆ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘క్రికెట్ కిట్ అనేది క్రికెటర్లందరికీ తప్పనిసరి ఉండాల్సింది. ఇక నా కిట్ గురించి చెప్పాల్సి వస్తే.. నేను కిట్ ను చాలా నీట్ గా సర్దుకుంటాను. నా కిట్ బ్యాగ్ ను సర్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక నా కిట్ బ్యాగ్ లో.. ముందుగా థై పాడ్స్ ఉంటాయి. వీటి మీద నా టెస్టు క్రికెట్ జెర్సీ నెంబర్ ఉంటుంది. ఇది నాకు చాలా ప్రత్యేకం. వీటి తర్వాత ఎంఆర్ఎఫ్ ప్యాడ్స్. ప్రతి సిరీస్ కు నేను ప్యాడ్స్ మారుస్తుంటా.
ఇక వీటితో పాటు 10 లేదా 11 చేతి గ్లవ్స్ తప్పకుండా పెట్టుకుంటా. దుబాయ్ తో పాటు విదేశాలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే వాటికి అనుగుణంగా నేను గ్లవ్స్ మార్చుతుంటా. నాకు మరో కిట్ బ్యాగ్ ఉంది. అందులో మరో 8 గ్లవ్స్ ఉన్నాయి. ఐపీఎల్ వంటి పెద్ద టోర్నమెంట్లంటే ఇవన్నీ తీసుకెళ్లక తప్పవు. ఇక ఇవే గాక.. నా పూమా షూస్, గ్రిప్ హోల్డ్, బ్యాట్ స్టిక్కర్స్ ఉంటాయి. ఇక కిట్ కింద ఉండే పాకెట్ లో నేను రెండు లేదా మూడు బ్యాట్లు పెట్టుకుంటా. ఇవి నేను మ్యాచ్ లో వాడే బ్యాట్లు. వీటిని నేను ప్రాక్టీస్ సెషన్ లో వాడను...’ అంటూ కోహ్లీ ముగించాడు.
విరాట్ కు ద్రావిడ్ స్పెషల్ క్లాస్..
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన కోహ్లీకి రాహుల్ ద్రావిడ్ స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. రెండేండ్లుగా సెంచరీ చేయలేక చతికిలపడుతున్న విరాట్.. ఈ సిరీస్ లో రాణించకుంటే టెస్టు కెప్టెన్సీ కూడా ప్రమాదంలో పడే అవకాశముంది. దీంతో అతడు సఫారీ టూర్ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. అదీగాక దక్షిణాఫ్రికా మీద ఇంతవరకు సిరీస్ గెలవని భారత్ కు.. ఇది సువర్ణావకాశంగా క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో విరాట్ ఈ సిరీస్ మీత మరింత ఫోకస్ చేశాడు. 2018లో ఇదే సఫారీ గడ్డ మీద.. తొలిటెస్టు జరిగే సెంచూరీయన్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో కోహ్లీ.. 153 పరుగులు చేశాడు. మరి రాబోయే సిరీస్ లో అయినా కోహ్లీ తన 71వ శతకాన్ని బాదుతాడా..? లేదా..? అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.