IND vs ENG: పుజారా కు నో ఛాన్స్ .. కోహ్లీ స్థానంలో టీమిండియాలోకి రజత్ పాటిదార్‌

By Mahesh Rajamoni  |  First Published Jan 24, 2024, 1:49 PM IST

India vs England: విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు.  కోహ్లీ స్థానంలో రజత్ పాటిదార్‌ జట్టు లోకి వచ్చాడు.


India vs England: 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటిస్తోంది. జనవరి 25 నుంచి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ సిరీస్ కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టు మ్యాచ్ ల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతని స్థానంలో ప్రస్తుతం బ్యాట్ తో అదరగొడుతున్న రజత్ పాటిదార్ ను జట్టులోకి తీసుకున్నారు. భారత్-ఏ తరఫున ఆడుతున్న రజత్ పాటిదార్ ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు సెంచరీలు సాధించాడు. 5 రోజుల్లో రెండు సెంచరీలు సాధించి టీమ్ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

విరాట్ కోహ్లీ దూరం..

Latest Videos

వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఇందుకోసం కోహ్లీ జట్టు యాజమాన్యాన్ని కోరగా బీసీసీఐ సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అతని నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తోందని, బోర్డు, టీమ్ మేనేజ్మెంట్ స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కి మద్దతు తెలిపాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ లో మిగతా ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తారనే నమ్మకం ఉందనీ, ఈ సమయంలో విరాట్ కోహ్లీ ప్రైవసీని గౌరవించాలనీ, అతని వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు మానుకోవాలని మీడియాను, అభిమానులను కోరుతుందని బీసీసీఐ తెలిపింది. అలాగే, టెస్టు సిరీస్ లో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడంపై భారత క్రికెట్ జట్టు దృష్టి సారించిందని తెలిపింది.

5 రోజుల్లో 2 సెంచరీలతో అదరగొట్టిన రజత్ పాటిదార్‌

30 ఏళ్ల బ్యాట్స్ మన్ రజత్ పాటిదార్ తొలి రెండు టెస్టులకు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతని తాజా ఫామ్ చూస్తే బ్యాట్ తో  పరుగుల వరద పారిస్తున్నాడు. గత వారం అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 151 పరుగులు చేశాడు. 4 రోజుల క్రితం ఇదే జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో 111 పరుగులు చేశాడు. గతేడాది చివరలోనూ భారత్-ఏ జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. అయితే, అతను ఇంకా అరంగేట్రం చేయలేదు. ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్ లో అతనికి అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

పుజారాకు నో ఛాన్స్ చోటు.

విరాట్ కోహ్లీ రెండు టెస్టుల నుంచి తప్పుకోవడంతో ఛతేశ్వర్ పుజారా తిరిగి జట్టులోకి వస్తాడని భావించినా అది జరగలేదు. కోహ్లీ స్థానంలో రజత్ పాటిదార్ కు చోటు దక్కింది. రంజీ ట్రోఫీ 2024లో పుజారా అద్భుతమైన ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రంజీ సీజన్ తొలి మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా అతని బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ వచ్చాయి. జట్టులోకి వస్తాడని అనుకున్నా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో కూడా పుజారాకు జట్టులో చోటు దక్కలేదు.

click me!