
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు బాదుడు మంత్రాన్ని వాడింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన బ్యాటర్లలో ఇషాన్ కిషన్ మినహా ప్రతి ఒక్క బ్యాటర్ బంతిని బాదకుండా పెవిలియన్ కు వెళ్లలేదు. ఫలితంగా వ్యక్తిగతంగా భారీ స్కోర్లేమీ నమోదు కాకపోయినా భారత జట్టు మాత్రం ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు.. 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మిగతావారికంటే కాస్త ఎక్కువ బాదాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు సారథి రోహిత్ శర్మ (14 బంతుల్లో 24, 5 ఫోర్లు) మెరుపు ఆరంభాన్నే ఇచ్చాడు. సామ్ కరన్ వేసిన తొలి ఓవర్లో ఫోర్ కొట్టి ఖాతా తెలిరిచిన హిట్ మ్యాన్.. టోప్లే బౌలింగ్ లో రెండు, మోయిన్ అలీ బౌలింగ్ లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. కానీ అలీ వేసిన మూడో ఓవర్లో ఐదో బంతికి వికెట్ కీపర్ జోస్ బట్లర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అలీ తర్వాత ఓవర్లో ఇషాన్ కిషన్ (8) ను కూడా ఔట్ చేశాడు.
రోహిత్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా (17 బంతుల్లో 33.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అలీ వేసిన ఐదో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన అతడు.. తర్వాత ఓవర్ వేసిన టోప్లే బౌలింగ్ లో మూడు బౌండరీలు బాదాడు. దీంతో ఆరు ఓవర్లకే స్కోరు 66 పరుగులకు చేరింది.
హుడా తో పాటు జతకలిసిన సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 39, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగానే ఆడాడు. టైమల్ మిల్స్ బౌలింగ్ లో సిక్సర్ బాదిన అతడు.. తర్వాత ఓవర్ వేసిన పార్కిన్సన్ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టాడు. ఫలితంగా భారత్.. 10 ఓవర్లకే వంద పరుగులు దాటింది. అయితే వెంటవెంటనే టీమిండియా ఈ ఇద్దరి వికెట్లను కోల్పోయింది. హుడాను 9వ ఓవర్లో ఔట్ చేసిన జోర్డాన్.. 12వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ను కూడా పెవిలియన్ కు పంపాడు.
హుడా స్థానంలో వచ్చిన హార్ధిక్ పాండ్యా (33 బంతుల్లో 51.. 6 ఫోర్లు, 1 సిక్స్) సైతం బ్యాట్ ఝుళిపించడంతో భారత స్కోరు బ్రేకుల్లేకుండా ముందుకెళ్లింది. లివింగ్ స్టోన్ వేసిన 13వ ఓవర్లో హార్ధిక్, అక్షర్ పటేల్ (12 బంతుల్లో 17.. 3 ఫోర్లు) లు తలో ఫోర్ కొట్టారు. 14ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 4 వికెట్లకు 150 పరుగులుగా ఉంది. అయితే 15, 16 వ ఓవర్లో భారత్ కు పరుగుల రాక తగ్గింది. అదే సమయంలో పార్కిన్సన్.. అక్షర్ పటేల్ ను ఔట్ చేశాడు. కానీ అదే ఓవర్లో తర్వాత బంతికి సిక్సర్ కొట్టిన పాండ్యా టీ20లలో తొలి అర్థ సెంచరీ (అంతర్జాతీయ క్రికెట్ లో) సాధించాడు. కానీ ఆ తర్వాత ఓవర్లోనే టోప్లే బౌలింగ్ లో హ్యారీ బ్రూక్ కు క్యాచ్ ఇచ్చాడు.
చివర్లో ఫినిషర్ దినేశ్ కార్తీక్ (11.. 2 ఫోర్లు) కూడా ఓ చేయి వేశాడు. కానీ చివరి ఓవర్లో మిల్స్ వరుస బంతుల్లో కార్తీక్, హర్షల్ లను ఔట్ చేసి భారత్ 200 స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్ అలీ, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్ చెరో రెండు వికెట్లు తీశారు. పార్కిన్సన్, టోప్లే లకు తలో వికెట్ దక్కింది.