Ind vs SL: మరో క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన.. లంకకు పరాజయం సంపూర్ణం.. కెప్టెన్ సెంచరీ వృథా

Published : Mar 14, 2022, 06:25 PM ISTUpdated : Mar 14, 2022, 06:35 PM IST
Ind vs SL: మరో క్లీన్ స్వీప్  చేసిన రోహిత్ సేన.. లంకకు  పరాజయం సంపూర్ణం.. కెప్టెన్ సెంచరీ వృథా

సారాంశం

India vs Srilanka 2nd Test: కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే, టీ20లతో పాటు టెస్టు సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ తోనే ఆరంభించాడు.  బెంగళూరు టెస్టును కూడా నెగ్గి లంక కు రిక్త హస్తాలు మిగిల్చాడు. 

నిన్న వెస్టిండీస్.. ఈరోజు శ్రీలంక.. జట్లు మారాయంతే..  టీమిండియా దూకుడు మాత్రం మారలేదు.  వరుసగా నాలుగో క్లీన్ స్వీప్ (వెస్టిండీస్ పై వన్డే, టీ20.. లంకపై టీ20, టెస్టు సిరీస్) ను   సాధిస్తూ.. విండీస్ ను పంపినట్టే లంకను కూడా ఉత్త చేతుల్తో వెనక్కి పంపింది రోహిత్ సేన. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి.. అందులో సగం  కూడా కొట్టనీయలేదు.  447 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక.. 208 పరుగులకే చాప చుట్టేసింది. ఆ  జట్టు సారథి కరుణరత్నె (107)  ఒంటరి పోరాటంతో సెంచరీ చేసినా  జట్టు పరాజయాన్ని ఆపలేకపోయాడు. 

మూడో రోజు 28 పరుగుల ఓవర్ నైట్  స్కోరు ఆట ఆరంభించిన లంక.. మూడో రోజు ఆటను ఫోర్ తో ఆరంభించింది. జడేజా వేసిన ఓవర్లో కరుణరత్నె వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు.  మరోవైపు కుశాల్ మెండిస్ కూడా అశ్విన్, జడ్డూలతో పాటు బుమ్రాను కూడా సమర్థంగా ఎదుర్కున్నాడు. 

కరుణరత్నె సంయమనంతో ఆడగా.. కుశాల్ మాత్రం దూకుడుగా ఆడాడు. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ  చేసుకున్న కుశాల్.. అశ్విన్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. ఇక కుశాల్ ఔట్ అయిన తర్వాతి ఓవర్లోనే   రవీంద్ర జడేజా.. మాథ్యూస్  (1) ను కూడా బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే అశ్విన్.. ధనుంజయ డి సిల్వ (4) ను కూడా ఔట్ చేసి లంకపై ఒత్తిడి పెంచాడు. అప్పటికీ లంక  స్కోరు 4 వికెట్ల నష్టానికి 105 పరుగులు. 

 

వికెట్ కీపర్ డిక్వెల్ల (12) తో కలిసి  లంక సారథి కరుణరత్నె  ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు తన 27 వ హాఫ్ సెంచరీ ని కూడా పూర్తి చేసుకున్నాడు. కొంతసేపటిదాకా ఈ ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ రోహిత్.. ఈ జంటను విడదీయడానికి బౌలింగ్ ఛేంజ్ చేశాడు. అక్షర్ పటేల్ వేసిన 41వ ఓవర్లో.. ముందుకొచ్చి ఆడబోయిన డిక్వెల్లా ను పంత్ స్టంపౌట్ చేశాడు. 

ఒకవైపు వికెట్లు పడుతున్నా కరుణరత్నె మాత్రం  సంయమనంతో ఆడాడు. బుమ్రా వేసిన 55వ ఓవర్లో సెంచరీ కొట్టి సెంచరీ సాధించాడు. అతడికి  ఇది 14వ సెంచరీ. కాగా భారత్ పై సెంచరీ సాధించిన మూడో లంక కెప్టెన్ కరుణరత్నె. డ్రింక్స్ సమయానికి లంక 55 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

 

ఇక 56వ ఓవర్ వేసిన బుమ్రా.. సెంచరీ చేసిన కరుణరత్నెను బౌల్డ్ చేశాడు. దీంతో 174 బంతులాడి లంకను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించిన కెప్టెన్ ఇన్నింగ్స్ కు తెరపడింది. 57 వ ఓవర్లో అశ్విన్ ఎంబుల్డెనియా (2) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఆ తర్వాతి ఓవర్లోనే బుమ్రా.. తన కెరీర్ లో ఆఖరి టెస్టు ఆడుతున్న లక్మల్ (1) ను బౌల్డ్ చేశాడు.  59వ ఓవర్లో అశ్విన్.. ఫెర్నాడో ను ఔట్ చేయడంతో లంక ఓటమి ఖరారైంది.  ఫలితంగా భారత్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. లంక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా కు 3 వికెట్లు దక్కగా.. అశ్విన్ 4 వికట్లు చేజిక్కించుకున్నాడు. అక్షర్ కు రెండు, జడేజాకు ఒక వికెట్ దక్కింది. కాగా.. ఈ మ్యాచులో  రెండు ఇన్నింగ్సులలో రాణించిన శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యంతం రాణించిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో భారత్ నే విజయం వరించిన విషయం తెలిసిందే. 

స్కోరు వివరాలు : ఇండియా తొలి ఇన్నింగ్స్ :  252 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 303-9 డిక్లేర్డ్ 
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 109 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 208 ఆలౌట్ 

ఈ విజయంతో భారత్.. 2021-22 హోం సీజన్ (ఇండియాలో) ను ఓటమి లేకుండా  ముగించింది. ఈ సీజన్ లో భారత్ నాలుగు టెస్టులు ఆడగా.. 3 విజయాలు సాధించింది. ఒకటి డ్రా (న్యూజిలాండ్ పై కాన్పూర్ లో)  అయింది. మూడు వన్డేలు, 9 టీ20లలో భారత్ దే విజయం.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !