
తొలి టెస్టులో ఫలితం తేలని పిచ్ తయారుచేసి తీవ్ర విమర్శల పాలైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆలోచనల్లో మార్పు వచ్చినట్టుంది. రావల్పిండి మాదిరిగానే తొలి రెండు రోజులు నిర్జీవంగా ఉన్న కరాచీ పిచ్.. మూడో రోజు ఎలా స్పందిస్తుందా..? అని అక్కడి అభిమానుల్లో ఒకటే ఆందోళన. వారి అనుమానాలను నిజం చేస్తూ.. కరాచీ పిచ్ పై మూడో రోజు ఆసీస్ బౌలర్లు చెలరేగారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పాక్ పనిపట్టారు. పాకిస్థాన్ ను తొలి ఇన్నింగ్స్ లో 148 పరుగులకే పెవిలియన్ కు పంపారు. తద్వార తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించారు.
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 189 ఓవర్లలో 556 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే. అయితే భారీ స్కోరును చూసి బెదిరిందో ఏమో గానీ.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కనీసం పోరాటం కూడా ప్రదర్శించలేదు పాక్. వచ్చినోళ్లు వచ్చినట్టే పెవిలియన్ కు చేరారు.
తొలి టెస్టులో పరుగుల వరద పారించిన ఓపెనర్లు షఫీక్, ఇమామ్ ఉల్ హక్ లు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మాత్రం విఫలమయ్యారు. షఫీక్ (13) రనౌట్ కాగా 64 బంతుల్లో 20 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో కమిన్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వీళ్లతో పాటు రావల్పిండి టెస్టులో సెంచరీ చేసిన అజర్ అలీ కూడా విఫలమయ్యాడు. 37 బంతుల్లో 14 పరుగులు చేసిన అతడిని స్టార్క్ పెవిలియన్ కు పంపాడు. ఐదో స్థానంలో వచ్చిన ఆలం (0) ను కూడా స్టార్క్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో పాక్.. 25 ఓవర్లలో 60 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (6) కూడా క్రీజులో నిలువలేదు. ఒకవైపు పాక్ సారథి బాబర్ ఆజమ్ (79 బంతుల్లో 36) పోరాడుతున్నా అతడికి మద్దతుగా నిలిచేవాళ్లే కరువయ్యారు. ఫాహిమ్ అష్రఫ్ (4), హసన్ అలీ (0), సాజిద్ ఖాన్ (5) అలా వచ్చి ఇలా వెళ్లారు. ఆఖరికి బాబర్ ను కూడా స్వెప్సన్ ఔట్ చేశాడు. ఇక చివర్లో నౌమన్ అలీ (35 బంతుల్లో 20 నాటౌట్), షాహీన్ అఫ్రిది (25 బంతుల్లో 19) లు బ్యాట్ ఝుళింపించడంతో పాక్ స్కోరు ఆ మాత్రమైనా చేయగలిగింది.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు దక్కించుకోగా.. స్వెప్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. లియాన్, కమిన్స్, గ్రీన్ లకు తలో వికెట్ దక్కింది. కంగారూల సమిష్టి బౌలింగ్ తో పాక్.. 53 ఓవర్లలో 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ కు 408 పరుగుల తొలి ఆధిక్యం దక్కింది. అనంతరం పాక్ ను ఫాలో ఆన్ ఆడించకుండా మళ్లీ బ్యాటింగ్ కు వచ్చింది ఆసీస్. 11 ఓవర్లు ముగిసేసరికి డేవిడ్ వార్నర్ (7) వికెట్ నష్టపోయి 47 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 438 గా ఉంది. ఉస్మాన్ ఖవాజా (24 నాటౌట్), లబూషేన్ (14 నాటౌట్) ఆడుతున్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలుండటంతో ఈ టెస్టులో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తున్నది.