IND vs SL: పింక్ బాల్ టెస్టుకు సర్వం సిద్ధం.. క్లీన్ స్వీప్ పై రోహిత్ సేన కన్ను..

Published : Mar 11, 2022, 07:34 PM IST
IND vs SL: పింక్ బాల్ టెస్టుకు  సర్వం సిద్ధం.. క్లీన్ స్వీప్ పై రోహిత్ సేన కన్ను..

సారాంశం

India Vs Srilanka 2nd Test: మొహాలీ టెస్టులో లంకను మట్టికరిపించిన టీమిండియా ఇప్పుడు మరో సీరిస్ క్లీన్ స్వీప్  పై కన్నేసింది.  కెప్టెన్ గా ప్రస్థానం ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటికే మూడు క్లీన్ స్వీప్ లు చేసిన  హిట్ మ్యాన్.. టెస్టు సిరీస్ ను కూడా అలాగే ముగించాలని భావిస్తున్నాడు. 

మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు గాను భారత పర్యటనకు వచ్చిన లంకకు గుండు సున్నా మిగిల్చేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. ఇప్పటికే  మూడు టీ20 ల సిరీస్ ను 3-0తో గెలిచి.. తొలి టెస్టులో గెలిచి  టెస్టు సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్..  బెంగళూరు వేదికగా శనివారం నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్టు (డే అండ్ నైట్) లో కూడా ఆ జట్టును ఓడించి వరుసగా నాలుగో క్లీన్ స్వీప్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ టెస్టు ప్రారంభం కానున్నది. ఇప్పటికే మొహాలీలో ముగిసిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకున్న లంక.. ఈ టెస్టులో అయినా ధీటుగా జవాబివ్వాలని కోరుకుంటున్నా పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవు. 

పింక్ బాల్ టెస్టు గా జరుగబోయే ఈ  మ్యాచులో భారతే హాట్ ఫేవరేట్. ఫామ్ పరంగా చూసినా భారత్ తో పోటీ పడేంత స్థాయిలో లంక లేదు. తొలి టెస్టులో  ఆ జట్టు బౌలింగ్ ను భారత బ్యాటర్లు తుత్తునీయలు చేశారు. ఒకరిద్దరు భారత బ్యాటర్లు మినహా మిగిలినవారంతా..  మంచి స్కోర్లే సాధించారు. ఇక బౌలింగ్ లో భారత స్పిన్ దాడిని తట్టుకుని నిలవడం లంకకు పనికి మించిన భారమే. 

బ్యాటింగ్ లోతు.. బౌలింగ్ బలం.. 

రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, హనుమా విహారి, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా,  రవిచంద్రన్  అశ్విన్.. ఈ లైనప్ చూస్తే చాలు భారత బ్యాటింగ్ లోతు ఎంతో చెప్పడానికి..  మొహాలీ టెస్టులో  మిడిలార్డర్ లో వచ్చిన రిషభ్ పంత్ (96),  రవీంద్ర జడేజా (175 నాటౌట్) లతో పాటు అశ్విన్, హనుమా విహారి కూడా రాణించారు.  ప్రధాన బ్యాటర్లంతా ఫామ్ లోనే ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. 

 

ఇక బౌలింగ్ విషయానికొస్తే.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలు పేస్ బౌలింగ్ బాధ్యతలు మోస్తుండగా అశ్విన్, రవీంద్ర జడేజా లు  స్పిన్ భారాన్ని మోస్తున్నారు. గత టెస్టులో జడ్డూ 9 వికెట్లు తీయగా.. అశ్విన్ 6 వికెట్లతో చెలరేగాడు. వీరికి తోడు షమీ, బుమ్రా కూడా మెరుస్తున్నారు. అయితే బెంగళూరులో  పింక్ బాల్ టెస్టు కావడంతో ఈ టెస్టులో అక్షర్ పటేల్ ను గానీ, మహ్మద్ సిరాజ్ ను గానీ  తుది జట్టులో ఆడించాలని భారత్ భావిస్తున్నది.  మొహాలీ టెస్టులో  అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా ఆకట్టుకోని జయంత్ యాదవ్ ను పక్కనబెట్టి  సిరాజ్, అక్షర్ లలో ఎవరో ఒకరిని ఆడించే అవకాశమున్నది. బంతిపై పచ్చిక ఉంటే సిరాజ్ తో వెళ్లాలని, రాత్రి పూట మంచు కురిసే అవకాశముంటే అక్షర్ ను ఆడించాలని రోహిత్ భావిస్తున్నాడు. 

లంకకు గాయాల బెడద : 

అన్ని విభాగాల్లో బలంగా ఉండి భారత్   క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నిస్తుంటే మరోవైపు లంక పరిస్థితి మరోరకంగా ఉంది.  ఆ జట్టును గాయాల బెడద వేధిస్తున్నది. లంక జట్టులో  అంతో ఇంతో ఫామ్ లో ఉన్న ఏకైక బ్యాటర్ పతుమ్ నిస్సంక..  గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు.  ఫాస్ట్ బౌలర్ లాహిరు కుమార కూడా గాయం తో  బెంగళూరు టెస్టులో ఆడేది అనుమానంగానే ఉంది.  ఆదుకుంటారనుకున్న సీనియర్లు ఏంజెలా మాథ్యూస్, ధనుంజయ డి సిల్వాలు తొలి టెస్టులో ఆకట్టుకోలేదు. కెప్టెన్ కరుణరత్నే,  ఓపెనర్ తిరిమన్నెలు లంకకు భారీ ఇన్నింగ్సులు భాకీ పడ్డారు. వీళ్లు రాణిస్తేనే ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసే అవకాశం ఉంది.  ఇక బౌలింగ్  విషయానికొస్తే.. తొలి టెస్టులో స్పిన్నర్ లసిత్ ఎంబుల్డెనియా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. సీనియర్ బౌలర్ లక్మల్ కు  ఇదే ఆఖరి టెస్ట్. 

కోహ్లి పైనే కళ్లన్నీ.. 

బెంగళూరు టెస్టు కోహ్లికి 101వ టెస్టు.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఇక్కడ వందలాది మ్యాచులు ఆడిన కోహ్లి.. ఇక్కడైనా తన సెంచరీ గండాన్ని దాటాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ స్టేడియంలో వంద శాతం ప్రేక్షకులను అనుమతించనున్నారు. మరి తన హోంగ్రౌండ్ గా భావించే చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి సెంచరీ సాధిస్తాడేమో చూడాలి. 

స్వదేశంలో ఇదే ఆఖరి టెస్టు : 

భారత్ కు ఈ ఏడాది స్వదేశంలో ఇదే ఆఖరి టెస్టు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరుగుతున్న ఈ టెస్టు తర్వాత మళ్లీ ఈ ఏడాది  టీమిండియా.. స్వదేశంలో టెస్టు ఆడదు.  ఐపీఎల్ తర్వాత భారత జట్టు గతేడాది ఇంగ్లాండ్ తో ముగిసిన  ఆఖరి టెస్టును ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో  రెండు టెస్టులు ఆడాల్సి ఉంది.  ఇక ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా తో నాలుగు టెస్టులు ఆడుతుంది. మొత్తం ఏడు  మ్యాచుల్లో గెలిస్తేనే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు భారత్ అర్హత సాధిస్తుంది.  

జట్లు (అంచనా) : టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, హనుమా విహారి, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ (లేదా) అక్షర్ పటేల్ 
 

శ్రీలంక : లాహిరు తిరిమన్నె, దిముత్్ కరుణరత్నె (కెప్టెన్), కుశాల్ మెండిస్, ఏంజెలొ మాథ్యూస్, ధనుంజయ డి సిల్వ, చరిత్ అసలంక, డిక్వెల్ల, సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్డెనియ, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?