
లోకమంటే ఏంటో కూడా తెలియని వయసులోనే బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడాడు సచిన్ టెండూల్కర్. చిన్నప్పట్నుంచి క్రికెట్ మీదే తన ధ్యాసనంతా పెట్టి పదహారేళ్ల వయసులోనే భారత క్రికెట్ లో అడుగుపెట్టి.. దేశంలో క్రికెట్ దేవుడిగా మారాడు. ఇది చరిత్ర. ఇప్పుడు సచిన్ పుట్టిన అదే మహారాష్ట్ర గడ్డ నుంచి మరో లిటిల్ మాస్టర్ రాబోతున్నాడా..? అంటే అవుననే చెప్పక తప్పదు. ఐదేండ్ల వయసున్న ఓ బుడ్డోడు.. అచ్చం చిన్ననాటి సచిన్ ను మరిపిస్తూ అదరగొడుతున్నాడు. లిటిల్ మాస్టర్ మాదిరిగానే స్ట్రేయిట్ డ్రైవ్ లు, బ్యాక్ ఫ్లిఫ్ లు, కవర్ డ్రైవ్ లు, హుక్ షాట్ లు ఆడుతూ ఔరా.. అనిపిస్తున్నాడు. సచిన్ ను నరనరాల్లో నింపుకున్న ఈ బుడ్డోడు ఇప్పుడు తన అభిమాన ఆటగాడిని కూడా కలిశాడు.
మహారాష్ట్రకు చెందిన షేక్ షంషేర్ కుమారుడే ఎస్కే షాహీద్. షంషేర్ ఒక బార్బర్ షాపులో పనిచేస్తున్నాడు. అతడికి సచిన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు తాను క్రికెటర్ కావాలనుకున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకలేదు. అయితే తన కొడుకును మాత్రం పెద్ద క్రికెటర్ చేయాలని కలలు కంటున్నాడు షంషేర్.
తన కొడుకు బుడి బుడి అడుగులు నేర్చుకుంటున్నప్పుడే ఆ పసివాడికి బ్యాట్ ను అందించాడు షంషేర్. అతడికి సచిన్ గత మ్యాచుల వీడియోలు చూపించేవాడు. దీంతో ఆ చిన్న పిల్లవాడు సైతం సచిన్ ను ఆవాహనం చేసుకున్నాడు. అచ్చం సచిన్ మాదిరే ఆడటం నేర్చుకున్నాడు.
షాహీద్ బ్యాటింగ్ చేస్తున్న ఓ వీడియోను అతడు సోషల్ మీడియా లో పోస్టు చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రముఖ క్రికెట్ ఛానెల్.. ఫాక్స్ క్రికెట్ ట్విట్టర్ లో షేర్ చేసింది. అంతేగాక వీడియోను సచిన్ టెండూల్కర్, మైఖేల్ వాన్, షేన్ వార్న్ లకు కూడా ట్యాగ్ చేసింది.
విషయం తెలుసుకున్న సచిన్.. షంషేర్ ను ముంబైలో ఉన్న తన అకాడమీకి పిలిపించుకున్నాడు. ఐదు రోజులు వారికి అక్కడే వసతి ఏర్పాటు చేశాడు. షాహీద్ కు తన అకాడమీలో ప్రాక్టీస్ కూడా ఇప్పించాడు. అంతేగాక ఆ పిల్లవాడి క్రికెట్ కోచింగ్ కు సంబంధించిన ఫీజునంతా తానే భరిస్తానని షంషేర్ తో చెప్పాడు.
ఇక షాహీద్ బ్యాటింగ్ చేస్తుండగా సచిన్ అతడిని గమనిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సచిన్ ను కలవడంపై షంషేర్ స్పందిస్తూ... ‘నేను సచిన్ కు వీరాభిమానిని. నా కొడుకు కూడా సచిన్ నే ఆరాధిస్తాడు. అతడికి సచిన్ ను కలవాలనేది డ్రీమ్. ఫాక్స్ క్రికెట్ ట్వీట్ ద్వారా మమ్మల్ని సచిన్ తనవద్దకు పిలిపించుకుని బాగా చూసుకున్నాడు. నా కొడుకుకు తన అకాడమీలోనే ఐదు రోజులు ప్రాక్టీస్ కూడా ఇప్పించాడు. షాహీద్ లో సహజ టాలెంట్ ఉందని, దానిని తుంచివేయొద్దని నాతో చెప్పాడ’ని తెలిపాడు.
ఇక సచిన్ తో ఏం మాట్లాడావని షాహీద్ ను అడగగా.. ‘బ్యాక్ ఫుట్ షాట్, ఫ్రంట్ ఫుట్ షాట్ ఎలా ఆడాడో సచిన్ నాకు చెప్పాడు. చెప్పడమే గాక ఆడి కూడా చూపించాడు. ఆ తర్వాత క్యాచులు ఎలా పట్టాలో నేర్పించాడు.. ఇక అకాడమీలో ఉన్న కోచ్ లు బ్యాట్ ఎలా పట్టుకోవాలి..? బ్యాట్ కు గ్రిప్ ఎలా ఉండాలి..? అనే విషయాలు నేర్పించారు’ అని చెప్పాడు.