Latest Videos

IND vs PAK: రోహిత్ శ‌ర్మ‌-విరాట్ కోహ్లీలు కాదు.. ఈ ఇద్దరు స్టార్ల వల్లే పాక్ పై భార‌త్ గెలుపు

By Mahesh RajamoniFirst Published Jun 10, 2024, 3:13 AM IST
Highlights

IND vs PAK:  భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ లో స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌-విరాట్ కోహ్లీలు త్వ‌ర‌గా ఔట్ కావ‌డం మ్యాచ్ మొత్తంగా ఇప్పుడు చాలా బాధ క‌లిగించడం లేదు. ఎందుకంటే మ‌రో ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు పాక్ పై అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్ కు విజ‌యాన్ని అందించారు. వారే రిష‌బ్ పంత్, జ‌స్ప్రీత్ బుమ్రా.. ! 
 

T20 World Cup 2024, IND vs PAK: భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డబుల్ డోస్ ఉత్కంఠ కనిపించింది. మ్యాచ్ మొత్తంలో పాకిస్థాన్ పైచేయి క‌నిపించినా.. మ్యాచ్ చివరి 5 ఓవర్లలో టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. బుమ్రా బ్రేక్ త్రూ అందిస్తూ భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు. చివ‌రి వ‌ర‌కు సాగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై భార‌త్ పై చేయి సాధించి వ‌ర‌ల్డ్ క‌ప్ లో మ‌రో విజ‌యాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ ఆరంభం నుంచి పాకిస్తాన్ పైచేయి క‌నిపించింది కానీ, చివరి 5 ఓవర్లలో మ్యాచ్ ను మ‌లుపు తిప్పిన మ‌న బౌల‌ర్లు..  రోహిత్, విరాట్ వికెట్ల గురించి ఎవరూ ఆందోళన చెందకుండా చేశారు. పాకిస్థాన్‌పై టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీని సాధించింది. చిరస్మరణీయ విజయం సాధించిన ఘనత టీమ్ ఇండియా ఇద్దరు ఆటగాళ్లకు ద‌క్కింది. వారిలో ఒకరు బ్యాటింగ్‌లో జట్టు గౌరవాన్ని కాపాడిన రిష‌బ్ పంత్, మరొకరు బౌలింగ్‌లో బ్రేక్ త్రూ అందించి పాకిస్తాన్‌ను ప‌త‌నాన్ని శాసించిన జ‌స్ప్రీత్ బుమ్రా.

ట్రబుల్ షూటర్ గా రిష‌బ్ పంత్.. 

పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌కు ఆదిలోనే అదృష్టం కలిసి వచ్చింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని ఎంచుకున్నాడు. బౌలింగ్ సమయంలో, పాక్ జట్టు భీకరంగా సంబరాలు చేసుకునే అవకాశాన్ని పొందింది, ఎందుకంటే టీమిండియా ఆరంభం అవమానకరంగా ఉంది. రోహిత్-కోహ్లి చౌకగా పెవిలియన్‌కు చేరుకున్నారు. వ‌రుస వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో రిష‌బ్ పంత్ పాకిస్తాన్ బౌలింగ్ ను ఎదుర్కొంటూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్ నుంచి వికెట్ల పతనం జరుగుతుండగా, మరో వైపు నుంచి పంత్ బ్యాటింగ్ తో భార‌త‌ స్కోర్ బోర్డును ముందుకు న‌డిపించాడు. 31 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాటు అక్షర్ పటేల్ కూడా 20 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ల కారణంగా జట్టు స్కోరు 119కి చేరుకోగలిగింది.

పాక్ ఆశలపై నీళ్లుజ‌ల్లిన‌ బుమ్రా

కేవలం 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఓపెన‌ర్లు పాక్ జట్టు శుభారంభం అందించారు. మ్యాచ్ భారత్ చేతుల్లోంచి జారిపోతున్నట్లు అనిపించింది. ఎందుకంటే పాకిస్థాన్ ఒక్క‌వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్ మెన్ మహ్మద్ రిజ్వాన్ భారత్ ముందు గోడలా నిలబడి కనిపించాడు. కానీ 15వ ఓవర్లో రిజ్వాన్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ వికెట్ తర్వాత పాక్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. రిజ్వాన్ 31 పరుగుల వద్ద ఔటయ్యాడు, ఆపై పాక్  ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయాడు. 7 వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో  ఆరు ప‌రుగుల తేడాదో భార‌త్ మ‌రో విజయాన్ని అందుకుంది. బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు. పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

టీం ఇండియా ప్రపంచ రికార్డు.. 

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా 7వ సారి విజయం సాధించింది. ఈ విజయం తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా భారీ రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌లో ఒక జట్టుపై అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన టీమ్ గా భార‌త్ నిలిచింది.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు జట్టును ఓడించిన జట్లు

భారత్ vs పాకిస్తాన్ - 7 విజయాలు
పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ - 6 విజయాలు
శ్రీలంక vs వెస్టిండీస్ - 6 విజయాలు
ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ - 5 విజయాలు 
ఇంగ్లాండ్ vs శ్రీలంక - 5 విజయాలు

IND vs PAK : భార‌త్-పాకిస్తాన్.. మనల్ని ఆపేది ఎవడ్రా.. ! 

click me!