Hardik Pandya: షాకింగ్ న్యూస్.. క్రికెట్ నుంచి హార్దిక్ పాండ్యా రిటైర్మెంట్..? ఇక దానికే పరిమితం...!

By team teluguFirst Published Dec 7, 2021, 6:51 PM IST
Highlights

Hardik Pandya Retirement: వెన్ను నొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్ పాండ్యా.. ఇక క్రికెట్ కు స్వస్థి చెప్పనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వర్గాలు.

టీమిండియాతో పాటు భారత జట్టు అభిమానులకు ఇది షాకింగ్ న్యూసే.. Team India ఆల్ రౌండర్ Hardik Pandya తన కెరీర్ కు సంబంధించి  కీలక నిర్ణయం వెల్లడించేందుకు సిద్ధమవుతున్నాడా..?  వెన్ను నొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న  హార్దిక్ పాండ్యా.. ఇక Cricketకు స్వస్థి చెప్పనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వర్గాలు. గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న హార్ధిక్ పాండ్యా.. త్వరలోనే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్టు BCCI వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి.

క్రీడలకు సంబంధించిన ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఫామ్ లేమితో సతమతమవుతున్న హార్దిక్.. టెస్టు క్రికెట్ నుంచి  వైదొలగాలని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా అనధికారికంగా వెల్లడించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయి పరిమిత ఓవర్ల క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో కొనసాగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 

ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘గత కొంతకాలంగా అతడు (హార్దిక్ పాండ్యా) గాయాలతో సతమతమవుతున్నాడు. ఇప్పటికైతే మాకు అధికారికంగా చెప్పలేదు, కానీ అతడు రెడ్ బాల్ క్రికెట్ (టెస్టులు) నుంచి రిటైర్ అయ్యే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే అది అతడికి ఉపకరించేదే.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మెరుగ్గా రాణించేందుకు పాండ్యాకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తున్నాను. ఒకవేళ అతడు టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. అదే నిజమైతే మేము బ్యాకప్ ను సిద్ధం చేసుకోవాలి..’ అని తెలిపాడు. 

28 ఏండ్ల ఈ బరోడా క్రికెటర్.. భారత జట్టు తరఫున 2018లో ఆఖరి టెస్టు ఆడాడు. తన కెరీర్ లో ఇప్పటివరకు 11 టెస్టులాడిన హార్దిక్.. 18 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 532 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. 19 ఇన్నింగ్సులలో బౌలింగ్ చేసిన పాండ్యా 17 వికెట్లు పడగొట్టాడు.  

వెన్నునొప్పి తర్వాత శస్త్ర చికిత్స చేయించుకుని టీమిండియాలోకి తిరిగివచ్చిన పాండ్యా.. బౌలింగ్ వేయడానికి తంటాలు పడుతున్నాడు. గత 12 నెలలలో పాండ్యా.. వన్డేలు, టీ20లలో కలిసి 46 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. 2018 నుంచి అతడు టెస్ట్ మ్యాచే ఆడలేదు. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన సిరీస్ లో బౌలింగ్ చేసినా అంతంతమాత్రమే. ఇక టీ20 ప్రపంచకప్ లో కూడా ఆల్ రౌండర్ కోటాలోనే ఎంపికైన హార్ధిక్.. ఆ పాత్రకు సరైన న్యాయం చేయలేదు. దీంతో అతడు జట్టు లో స్థానం కోల్పోయాడు. తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నుంచి ముంబై ఇండియన్స్ కు ఆడిన పాండ్యా ను ఆ ఫ్రాంచైజీ కూడా పక్కనబెట్టింది. 

ఒకవేళ పాండ్యా టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే అది భారత్ కు కచ్చితంగా ఎదురుదెబ్బే. కపిల్ దేవ్ తర్వాత అంతటి నిఖార్సైన ఆల్ రౌండర్ కోసం దశాబ్దాల పాటు వేచి చూసిన భారత జట్టుకు  హార్ధిక్ రూపంలో ఒక ఆల్ రౌండర్ దొరికాడని భావించినా.. పాండ్యా మాత్రం గాయాల కారణంగా ఆ ఆశను తుంచివేశాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘మాకు కచ్చితంగా బ్యాకప్ (ఆల్ రౌండర్) కావాలి. దీనిపై సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ చర్చ జరపాలి. శార్ధుల్ ఠాకూర్ తో పాటు వెంకటేశ్ అయ్యర్ కూడా ఆప్షన్లు గా ఉన్నారు. వీళ్లతో పాటు ఇతర ఆప్షన్లను కూడా మేము వెతకాలి...’ అని తెలిపాడు.

click me!