
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఇటీవలే ముగిసింది. వచ్చే నెల 27 నుంచి ఐపీఎల్-15 అసలు సమరం మొదలుకానున్నది. సుమారు రెండు నెలల పాటు జరుగబోయే ఈ మెగా సీజన్ లో ఈసారి పది జట్లు పోటీలో నిలవనున్నాయి. ఐపీఎల్ లోకి కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా ఐపీఎల్.. కరోనా నిబంధనల నడుమ జరుగనున్నది. ఇందుకోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నది.
తాజా రిపోర్డుల ప్రకారం.. ఐపీఎల్-15 వేదికలను కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) ఖరారు చేసినట్టు తెలుస్తున్నది. గతంలో మహారాష్ట్ర లో నిర్వహించతలపెట్టిన ఈ టోర్నీని ఇప్పుడు గుజరాత్ లో కూడా నిర్వహించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జాతీయ మీడియా కథనాల సారాంశం.
మహారాష్ట్రలోని ముంబై, పూణెతో పాటుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కూడా ఐపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నాలుగు ప్రధాన స్టేడియాలు.. వాంఖడే స్టేడియం, బ్రబోర్న్ స్టేడియం, డాక్టర్ డీవై పాటిల్ ప్టేడియం, జియో స్టేడియాలలో ఐపీఎల్ మ్యాచులను నిర్వహించనున్నారు. ముంబైతో పాటు పూణెలో కూడా ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయి.
ఈ రెండే గాక అహ్మదాబాద్ లో కూడా ఐపీఎల్ నిర్వహణకు అనుకూలంగా ఉన్నట్టు బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. దీంతో మొత్తం ఆరు వేదికలలో ఐపీఎల్ ను ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు బీసీసీఐ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ముంబై, పూణె, అహ్మదాబాద్.. సమీప నగరాలే. విమాన ప్రయాణాలు కూడా పెద్దగా చేయాల్సిన పన్లేదు. దీంతో ఫ్రాంచైజీలకు కూడా హోటల్ ఖర్చులని, విమాన ప్రయాణ చార్జీలని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
ఈ ఆరు వేదికలలో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ సుముఖంగా ఉన్నదని సమాచారం. ఇందుకు సంబంధించి బీసీసీఐ కూడా ఈ నెలాఖరున అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తున్నది.
మార్చి 27 నుంచి మే 28 మధ్య జరుగబోయే ఈ మెగా సీజన్ లో పది జట్లు పాల్గొననున్నాయి. పది ఫ్రాంచైజీలు ఉండటంతో ఈసారి వాటిని రెండు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక్కో జట్టు.. ప్రత్యర్థి గ్రూప్ లోని ఒక్కో జట్టుతో రెండు మ్యాచులు ఆడనున్నది. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో అన్ని జట్లు.. తదుపరి సీజన్ కోసం తమకు ఆడబోయే ఆటగాళ్ల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసి దక్కించుకున్నాయి. అందరికంటే ఎక్కువగా.. ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్ కిషన్ ను రూ. 15.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.