
ఐసీసీ టోర్నమెంట్‌లలో కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లను గెలిచేందుకు టీమిండియా అపసోపాలు పడటం ఈనాటిది కాదు. లీగ్ దశల్లో అద్భుతంగా రాణించి నాకౌట్‌లో బొక్కా బోర్లా పడటం టీమిండియాకు ఆనవాయితీగా మారింది. దీనిపై స్పందించారు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. శనివారం తన 51వ పుట్టినరోజు జరుపుకున్నారు దాదా. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాకౌట్‌లో భారత జట్టు ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2013లో ధోనీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫిని గెలిచుకున్న తర్వాత భారత్ మరే ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. అప్పటి నుంచి టీమిండియా నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోగా.. ఇంకొన్ని సార్లు సెమీఫైనల్ వరకు వెళ్లింది. భారత్ వైఫల్యాలకు కారణం మానసిక ఒత్తిడి కంటే ఎగ్జిక్యూషన్ లేకపోవడమేనన్నారు. తాము కీలకమైన దశలలో కొన్నిసార్లు బాగా రాణించలేదని.. దీనిని మానసిక ఒత్తిడిగా తాను పరిగణించడం లేదన్నారు. మానసికంగా టీమిండియా ఆటగాళ్లు చాలా దృఢమైన వ్యక్తులని.. వారు త్వరలోనే ఈ అడ్డు రేఖను దాటుతారని దాదా ఆకాంక్షించారు.
ALso Read: విరాట్, రోహిత్ టీ20లు ఆడాలి! టీ20 వరల్డ్ కప్ 2024లో ఉండాలి.. - సౌరవ్ గంగూలీ..
త్వరలో భారత్ వేదికగా ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి నాకౌట్ దశలో అద్భుతంగా రాణిస్తుందన్నారు. భారత్ కనీసం డబ్ల్యూటీసీ ఫైనల్సకు అర్హత సాధించిందని.. ఇది కూడా ఒక ఘనతేనని గంగూలీ పేర్కొన్నారు. జట్టులో మంచి ఆటగాళ్లున్నారని.. ఈసారి రాణిస్తారని ఆయన జోస్యం చెప్పారు. మరి 51వ పుట్టినరోజు ప్రణాళికల గురించి మాట్లాడుతుండగా.. భారత మాజీ కెప్టెన్ తన కుటుంబంతో గడుపుతానని పేర్కొన్నాడు. తన కుమార్తె సన సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిందని.. ఆగస్టు వరకు ఇక్కడే వుంటుందని దాదా చెప్పాడు. గడిచిన మూడేళ్లుగా తాను చాలా ప్రయాణాలు చేశానని.. కానీ ఈసారి మాత్రం ఇంట్లోనే వుండి కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం వచ్చిందన్నారు.