ఇదేం సెలెక్షన్..? వాళ్లిద్దరినీ ఎందుకు పక్కనబెట్టారు..? సెలెక్టర్లపై వెంగసర్కార్ ఫైర్

Published : Feb 20, 2022, 11:58 AM IST
ఇదేం సెలెక్షన్..? వాళ్లిద్దరినీ ఎందుకు పక్కనబెట్టారు..? సెలెక్టర్లపై వెంగసర్కార్ ఫైర్

సారాంశం

Team India Test Squad For Srilanka Series: శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపికపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కీలక ఆటగాళ్లపై వేటు వేసిన సెలెక్టర్లపై అభిమానులతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు.

శ్రీలంకతో జరుగబోయే  టెస్టు సిరీస్ కు భారత జట్టును ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ.. అయితే జట్టు ఎంపికపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.  టీమిండియా వెటరన్ ఆటగాళ్లు  అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా,  ఇషాంత్ శర్మ,  వృద్ధిమాన్ సాహా లను పక్కనబెట్టిన సెలెక్షన్ కమిటీ.. దేశవాళీలో రాణిస్తున్న  పలువురు యువ ఆటగాళ్లను కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మెన్   దిలీప్ వెంగసర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  జట్టు ఎంపిక, సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు సంధించాడు. 

వెంగసర్కార్ స్పందిస్తూ.. ‘శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపికను చూస్తుంటే వారు వివేకంగా ఆలోచించలేదని అవగతమవుతున్నది.  దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ లను ఎలా పక్కనబెడతారు..? 

 

ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టును చూడండి..  కొంత మంది ప్లేయర్లు టాలెంట్ ఉన్నా ఆమేరకు రాణించడం లేదు. గత కొంతకాలంగా వారి ప్రదర్శన అసలేం బాగోలేదు. రుతురాజ్, సర్ఫరాజ్ ఖాన్ లు జట్టులో కచ్చితంగా రావల్సిన వాళ్లు.  సెలెక్టర్లు వారిని ఎంపిక చేయకుండా వాళ్లిద్దరి నైతికతను దెబ్బతీస్తున్నారు...’ అని వాపోయాడు. 

రుతురాజ్ గైక్వాడ్.. గతేడాది ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్.  ఆ తర్వాత జరగిన విజయ్ హజారే ట్రోఫీలో ఇరగదీసే ప్రదర్శన చేశాడు. ఈ ట్రోఫీలో ఏకంగా నాలుగు సెంచరీలతో 600కు పైగా  పరుగులు చేశాడు. ఇక సర్ఫరాజ్ విషయానికొస్తే..  సయ్యద్ ముస్తాక్ అలీతో పాటు రంజీలలో కూడా  నిలకడగా రాణిస్తున్నాడు. 2019-20  రంజీ సీజన్ లో ఆరు మ్యాచులు ఆడి 952 పరుగులు చేశాడు. ఇక తాజాగా.. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన రంజీ  మ్యాచులో 275 పరుగులు చేశాడు. ఇది సెలెక్షన్ కమిటీ.. శ్రీలంకతో సిరీస్ కు జట్టును ప్రకటించడానికి ఒక్కరోజు ముందు జరిగిందే. ఇదే విషయాన్ని వెంగసర్కార్ ఎత్తి చూపుతూ సెలెక్టర్లపై విమర్శలు సందించాడు. 

కాగా.. శ్రీలంకతో టెస్టు సిరీస్ కు రోహిత్ శర్మను సారథిగా నియమించింది సెలెక్షన్ కమిటీ.. దీంతో మూడు ఫార్మాట్లలో టీమిండియాకు  కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు రోహిత్ శర్మ.  టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగాక కోహ్లి.. మొహాలీలో జరుగబోయే తొలి టెస్టులో రోహిత్ సారథ్యంలో ఆడనుండటం విశేషం. 

శ్రీలంకతో టెస్టు సిరీస్‌ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరబ్ కుమార్
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన