
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టుకు జోహన్నస్బర్గ్ లోని వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు కలిసిరాలేదు. టాస్ గెలిచిన టీమిండియాకు తొలి రోజు నిరాశే మిగిలింది. బ్యాటింగ్ లో మనవాళ్లు దారుణంగా విఫలమయ్యారు. తర్వాత బౌలర్లు 18 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ మాత్రమే దక్కించుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 18 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 35 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (57 బంతుల్లో 11 నాటౌట్), కీగన్ పీటర్సన్ (39 బంతుల్లో 14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు కెఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమిండియా.. 63.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌటైంది.
టీమిండియాను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన సపారీలు తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించగానే ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్టులో ఆ జట్టును వణికించిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ.. సౌతాఫ్రికాను తొలిదెబ్బ తీశాడు. సఫారీ ఇన్నింగ్స్ 3.5 ఓవర్లో మార్క్రమ్ (7) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 14 పరుగుల వద్దే దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది.
అదే ఊపు కొనసాగించిన భారత బౌలర్లు మిగిలిన 15 ఓవర్లు కూడా బాగానే బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం దక్కలేదు. మార్క్రమ్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన పీటర్సన్ తో కలిసి సారథి ఎల్గర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 202 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ (50), రవిచంద్రన్ అశ్విన్ (46) రాణించడంతో భారత జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26) ఫర్వాలేదనిపించినా భారీ స్కోరు చేయలేదు. పుజారా (3), రహానే (0) మరోసారి విఫలమయ్యారు. హనుమ విహారి (20), రిషభ్ పంత్ (17), ఠాకూర్ (0) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సేన్ నాలుగు వికెట్లు తీయగా.. రబాడ, ఒలివర్ మూడు వికెట్లు పడగొట్టారు.