
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండో టెస్టు ఆడుతున్న భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 202 పరుగులకే చాప చుట్టేసింది. వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై సఫారీ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గాయం కారణంగా రెండో టెస్టు నుంచి భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీ వైదొలగడంతో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించిన కెఎల్ రాహుల్ (50) ఒక్కడే రాణించాడు. ఇక లోయర్ ఆర్డర్ లో రవిచంద్రన్ అశ్విన్ (46) ఆదుకోకుంటే టీమిండియా ఆ మాత్రం పరుగులు కూడా చేయకపోయి ఉండేది.
తమకు అచ్చొచ్చిన వాండరర్స్ లో టీమిండియా ఆటగాళ్లు వండర్స్ క్రియేట్ చేస్తారని ఆశించిన భారత అభిమానులకు నిరాశే మిగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెఎల్ రాహుల్ సేన.. సఫారీ బౌలర్ల ధాటికి కుదేలైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26) ఫర్వాలేదనిపించినా.. పుజారా (3), రహానే (0) మరోసారి దారుణంగా విఫలమయ్యారు. చాలా కాలం తర్వాత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు కుర్రాడు హనుమ విహారి (20) అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా మిస్ చేసుకున్నాడు. టీ విరామానికి కొద్ది సమయానికి ముందు విహారి ఔటయ్యేసరికి భారత స్కోరు 38.4 ఓవర్లలో 4 వికెట్లకు 91 పరుగులు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా రాహుల్ మాత్రం సంయమనంతో ఆడాడు. తొలి టెస్టులో ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి జట్టును ఆదుకున్నాడు. 133 బంతులాడిన రాహుల్.. 50 పరుగులు చేసి జాన్సేన్ బౌలింగ్ లో రబాడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (17) ఏమాత్రం ఆకట్టుకోలేదు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం దూకుడుగా ఆడాడు. మూడో సెషన్ లో అతడి ఆటే హైలెట్ గా నిలిచింది.
50 బంతులు ఎదుర్కున్న అశ్విన్.. 46 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు కూడా ఉన్నాయి. జోరుమీదున్న అశ్విన్ ను జాన్సేన్ బోల్తా కొట్టించాడు. అశ్విన్ ఔటైన తర్వాత భారత లోయరార్డర్ పెద్దగా పోరాడకుండానే సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. శార్దుల్ ఠాకూర్ (0) మరోసారి బ్యాటింగ్ లో విఫలమవగా.. షమీ (9), సిరాజ్ (1) లు త్వరగానే పెవిలియన్ కు చేరారు. బుమ్రా 14 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా 63.1 ఓవర్లలో భారత జట్టు 202 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సేన్ 4 వికెట్లు పడగొట్టగా.. రబాడా, ఒలీవర్ మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. కాగా, పేస్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై భారత పేస్ త్రయం మహ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్ లు ఏమేర రాణిస్తారో చూడాల్సి ఉంది.