
BCCI issues 10 strict rules after RCB stampede: క్రికెట్ ఈవెంట్లపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు గెలుచుకున్న తర్వాత నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది.
జూన్ 4న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇప్పటికీ ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. కీలక నిర్ణయాలు తీసుకుంది.
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై సీరియస్‌గా స్పందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఐపీఎల్ విజయోత్సవాల నిర్వహణకు అవసరమైన భద్రతా మార్గదర్శకాలను రూపొందించింది.
బీసీసీఐ కార్యదర్శి దేబజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ, "ఇది ఆర్సీబీకి సంబంధించిన వ్యక్తిగత కార్యక్రమంగా ఉన్నా, భారతదేశ క్రికెట్‌కు బాధ్యత వహిస్తున్న బీసీసీఐగా మనం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి" అన్నారు.
1. ఐపీఎల్ టైటిల్ గెలిచిన 3-4 రోజుల వ్యవధిలో ఎటువంటి జయోత్సవం నిర్వహించరాదు.
2. తాత్కాలికంగా, సమర్థవంతమైన ఏర్పాట్లు లేని వేడుకలకు అనుమతి వుండదు.
3. బీసీసీఐ నుండి రాతపూర్వక అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమం చేయరాదు.
4. ప్రోగ్రామ్‌కు ముందు అధికారిక అనుమతి తప్పనిసరి.
5. కనీసం 4 నుండి 5 స్థాయిల భద్రతా ప్రోటోకాల్ అవసరం.
6. ప్రతి స్థలంలో, ప్రయాణ సమయంలో కూడా బహుళ భద్రత ఉండాలి.
7. ఎయిర్‌పోర్ట్ నుండి వేడుకా స్థలానికి జట్టు ప్రయాణానికి పూర్తి భద్రత కల్పించాలి.
8. క్రీడాకారులు, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలి.
9. జిల్లా పోలీస్, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి.
10. ప్రతి వేడుక చట్టబద్ధంగా, సురక్షితంగా జరిగేలా పౌర, చట్ట నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాలి.
ఈ నిబంధనలు భవిష్యత్ ఐపీఎల్ జయోత్సవాలన్నింటికీ తప్పనిసరి అయ్యేలా భారత క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక విజయం అనంతరం రోడ్ షోలు జరపడం సరైంది కాదు. మనకు ప్రజల ప్రాణాలకంటే ముఖ్యం మరొకటి లేదు. తగిన చర్యల తీసుకున్న తర్వాత ఈ తరహా ఉత్సవాలను పెద్ద హాల్స్ లో లేదా స్టేడియంలో నిర్వహించొచ్చు" అని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై న్యాయవాది, సామాజిక కార్యకర్త టీజే అబ్రహామ్ బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లపై అధికారిక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో మొత్తం 14 మంది అధికారుల పేర్లను ప్రస్తావించారు.
• డీకే శివకుమార్ ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత, రాజకీయ లాభాల కోసం వినియోగించారని తెలిపారు.
• చివరి నిమిషంలో రెండు పబ్లిక్ ఈవెంట్లను ఏర్పాటు చేయడం వల్ల పోలీసులు సిద్ధం చేసిన భద్రతా ప్రణాళికలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.
• సీఎస్ శాలిని రాజనీష్ ప్రజా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
• మాజీ డీసీపీ (సెంట్రల్) శేఖర్ హెచ్. టెక్కన్నావర్ స్టేడియం గేట్లను ఉద్దేశపూర్వకంగా మూసి ఉంచారన్న ఆరోపణలు ఉన్నాయి.
బెంగళూరు తొక్కిసలాట.. అరెస్టులు, కొనసాగుతున్న విచారణలు
ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే, DNA నెట్‌వర్క్స్ సిబ్బంది సహా నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిని తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.
టీజే అబ్రహామ్ గతంలో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్కాంలో సీఎం సిద్ధరామయ్యపై విచారణ కోరుతూ గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్‌కు పిటిషన్ సమర్పించిన సంగతి తెలిసిందే.
ఈ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం “కర్ణాటక క్రౌడ్ కంట్రోల్ (మాస్ గ్యాదరింగ్ వేదికలు, కార్యక్రమాలలో జన సమూహ నిర్వహణ)” చట్ట ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాపై రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. చట్టసభ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న హెచ్.కే. పటీల్ మాట్లాడుతూ, నాలుగు కీలక చట్టాల ముసాయిదాలు కేబినెట్ ఎదుట పెట్టామని తెలిపారు.
“కర్ణాటక క్రౌడ్ కంట్రోల్ బిల్లు, రోహిత్ వేముల బిల్లు, ఫేక్ న్యూస్ నిరోధక చట్టం, హేట్ స్పీచ్ నివారణ చట్టాలపై సంబంధిత మంత్రులు సమావేశమై మళ్లీ క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నారు” అని వెల్లడించారు.
చట్టంలోని ముఖ్యాంశాలు
• బహిరంగ కార్యక్రమాలకు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరి.
• ఆమోదం లేకుండా సభలు నిర్వహిస్తే, లేదా జనం నియంత్రణలో విఫలమైతే - మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, లేదా ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.
• ఈ నిబంధనలు రాజకీయ ర్యాలీలు, సమావేశాలు, సోషల్ ఈవెంట్స్‌కు వర్తిస్తాయి.
• తప్పుడు సమాచారం ఇచ్చి లేదా ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయవచ్చు.
• ఈ నేరాలు నాన్-కాగ్నిజబుల్, నాన్-బైలబుల్, ఫస్ట్ క్లాస్ మజిస్ట్రేట్ ఎదుట విచారణ జరగాల్సినవిగా గుర్తించారు.
అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ చట్టం వర్తించదని ముసాయిదా స్పష్టం చేసింది. వాటిలో జాతరలు, రథోత్సవం, పల్లకీ ఉత్సవం, తెప్పోత్సవం, ఊరసు, ఇతర ధార్మిక కర్మకాండలు ఉన్నాయి. ఈ ధార్మిక కార్యక్రమాలు ఏ మతానికి చెందినవైనా సరే, ఈ చట్ట పరిధిలోకి రావు.
కార్యక్రమ నిర్వాహకులు, పోలీసులు లేదా స్థానిక సంస్థలు తమ బాధ్యతల్లో విఫలమైతే, అది నేరంగా పరిగణిస్తారు. కార్యక్రమ సమయంలో మరణాలు, గాయాలు, తొక్కిసలాటలు జరగడం వల్ల బాధ్యతలను తప్పించుకోలేరు. సహకరించినవారు అయినా, సహకరించనివారైనా, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.