Virat Kohli: పరుగుల యంత్రానికి పండుగ దినం.. ఆ కోహ్లిని మళ్లీ చూస్తామా..? ఒకసారి వెనక్కి వెళ్తే..!

Published : Mar 03, 2022, 08:55 PM ISTUpdated : Mar 03, 2022, 09:02 PM IST
Virat Kohli: పరుగుల యంత్రానికి పండుగ దినం.. ఆ కోహ్లిని మళ్లీ చూస్తామా..? ఒకసారి వెనక్కి వెళ్తే..!

సారాంశం

Virat Kohli 100th Test: విరాట్ కోహ్లి.. పరిచయం అక్కర్లేని పేరు. పుష్కరకాలంగా భారత క్రికెట్ కు అతడు చేస్తున్న సేవ అనన్య సామాన్యం. శుక్రవారం అతడి క్రికెట్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఈ నేపథ్యంలో... 

భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ శకం ముగుస్తున్న కాలమది.. సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ బ్యాటింగ్ భారాన్ని తన భుజాలపై మోసిన సచిన్ నిష్క్రమణ అనంతరం ఎవరు  ఆ బాధ్యతలు మోస్తారు..? అప్పటికీ టీమిండియా అభిమానులను వేధించిన ప్రశ్న ఇది.  సచిన్ ను ఔట్ చేస్తే చాలు, భారత్ పని అయిపోయినట్టే అనే అభిప్రాయం అప్పట్లో ఉండేది.  మరి అలాంటిది సచినే రిటైర్ అవుతుంటే భారత జట్టు పరిస్థితి ఏంటి..? ఆ  లోటును భర్తీ చేసే ఆటగాడు ఎవరు..? సచిన్ లా నిలకడగా, సుదీర్ఘ కాలం పాటు  టీమిండియా బ్యాటింగ్ కు వెన్నెముకగా నిలిచేది ఎవరు..?  పై ప్రశ్నలన్నింటికీ  సమాధానం చెబుతూ తానున్నానని వచ్చాడు ఢిల్లీ నుంచి ఓ కుర్రాడు.

2008లో మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ నెగ్గింది. సిరీస్ నెగ్గిన ఆనందం కంటే భారత క్రికెట్ కు మరో సంతోషించదగిన విషయం అక్కడ దొరికింది. టీమిండియాకు మరో తరం గుర్తుంచుకునేలా  ఓ  ఆటగాడు  అందులో దొరికాడు.  ఆ కుర్రాడి పేరు  విరాట్ కోహ్లి. దేశ రాజధాని ఢిల్లీ నివాసి..   

ఒత్తిడిని చిత్తు  చేస్తూ.. 

క్రికెట్ అంటే పిచ్చి.  క్రికెటే లోకం. ఇదొక్కటి చాలదు అతడిని భారత జట్టులోకి ఆహ్వానించడానికి.  జాతీయ జట్టుకు ఆడాలని చిన్నప్పట్నుంచి  కోహ్లి పడిన కష్టం వృథా పోలేదు.  తాను ఇప్పుడు వందో టెస్టు ఆడబోయే శ్రీలంక మీదే.. 2008 ఆగస్టు 18న కోహ్లి తొలి వన్డే ఆడాడు. అందరు ఆటగాళ్ల మాదిరిగానే ఆదిలో కాస్త తడబాటు.  టీమ్ లోకి రావడం.. వెళ్లడం జరిగాయి. కానీ కొద్దికాలానికే అతడి స్థానాన్ని ఎవరూ టచ్ చేయనంత  సాలిడ్ గా వేసుకున్నాడు కోహ్లి.   మంచి నీళ్ల ప్రాయంగా  సెంచరీలు.. ఛేదనలో అయితే కోహ్లిని ఆపే బౌలరే లేడంటే అతిశయోక్తి లేదు. సాధారణంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏ ఆటగాడైనా తడబడతాడు. కానీ  కోహ్లి అలా కాదు. ఒత్తిడిలో ఉన్నప్పుడే తనలో అసలైన ఆటగాడు బయటకు వస్తాడని  కోహ్లి పలు సందర్భాలలో చెప్పాడు. 

 

2011 లో టెస్టుల్లోకి.. 

వన్డేలలో వరుసగా అదరగొడుతున్న కోహ్లి.. 2011 లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. 2011 జూన్ 20న తొలి టెస్టు ఆడాడు. అక్కడ కూడా సక్సెస్. భారత్ కు రెండు ప్రపంచకప్పులు అందించిన నయా క్రికెట్ స్ట్రాటజిస్టు మహేంద్ర సింగ్ ధోని కన్ను.. పరుగుల యంత్రం కోహ్లి మీద పడింది. కోహ్లిలో నాయకత్వ లక్షణాల గురించి ముందే తెలిసిన ధోనికి  తాను సారథ్యం నుంచి వైదొలిగినా భారత క్రికెట్ కు వచ్చిన నష్టమేమీ లేదని నమ్మకం కలిగింది. అంతే.. రెండేండ్ల టెస్టు కెరీర్  కూడా లేని కోహ్లికి టెస్టు పగ్గాలు అప్పజెప్పాడు ధోని. 2014లో కోహ్లి భారత టెస్టు సారథి అయ్యాడు.  కెప్టెన్ గా తొలి టెస్టులోనే ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలు. ఇక తర్వాత అంతా చరిత్రే.. 

రెండేండ్ల నుంచి శతక కరువు.. 

భారత క్రికెట్ లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన కోహ్లి.. కొన్నాళ్లుగా అనుకున్న  స్థాయిలో రాణించడం లేదు. 2019 ఆగస్టు లో బంగ్లాదేశ్ పై ఈడెన్ గార్డెన్ లో  చేసిన సెంచరీయే అతడి ఆఖరి శతకం. ఇప్పటికి 28 నెలలుగా అతడు దానికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.  సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడని మొదట భావించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో  కోహ్లి.. సచిన్ తో సమానంగా నిలవడం కూడా గగనమే. టెస్టులు, వన్డేలలో కలిపి సచిన్ వంద సెంచరీలు చేస్తే కోహ్లి ఆ జాబితాలో 70 వద్దే ఆగిపోయాడు. కోహ్లి వయసు రీత్యా అతడు సచిన్ ను అధిగమించడం కూడా కష్టమే.. 

కోహ్లి రికార్డులలో కొన్ని : 

టెస్టులు : ఆడిన టెస్టులు - 99,  పరుగులు - 7,962 , సగటు - 50.39, సెంచరీలు - 27, హాఫ్ సెంచరీలు : 28, అత్యధిక స్కోరు : 254 
వన్డేలు : మ్యాచులు - 260,  పరుగులు - 12,311, సగటు -58.07, సెంచరీలు - 43, హాఫ్ సెంచరీలు - 64, అత్యధిక స్కోరు - 183
టీ20లు : మ్యాచులు - 97, పరుగులు - 3,296, సగటు - 51.50, హాఫ్ సెంచరీలు - 30, అత్యధిక స్కోరు - 94 

- ఒక దేశంపై అత్యధిక పరుగులు : ఇంగ్లాండ్ మీద 1,960 (టెస్టులలో) 
- మూడు ఫార్మాట్  లలో 50 ప్లస్ సగటు ఉన్న ఆటగాడు కోహ్లి ఒక్కడే.. 
- భారత్ తరఫున టెస్టులలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు  కోహ్లి (7) మాత్రమే.. 
- టెస్టులలో కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానం. తొలి స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ (25).. కోహ్లి (20)
- టెస్టు కెప్టెన్సీ అరంగ్రేట మ్యాచులో రెండు సెంచరీలు చేసిన ఆటగాడు కోహ్లి మాత్రమే.. ఆస్ట్రేలియాపై 2014లో ఒకే టెస్టులో  115, 141 నాటౌట్ 
- భారత జట్టుకు టెస్టులలో అత్యధిక విజయాలు అందించిన సారథి (40 టెస్టు విజయాలు) 
-  కెప్టెన్ గా 150 ప్లస్ స్కోరు ఎక్కువ సార్లు (9) చేసిన ఆటగాడు
- ఐసీసీ ర్యాంకింగ్స్ లో మూడు ఫార్మాట్లలో  ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచిన ఆటగాడు : 2013 లో, 2018లో.. 

 

ఊరిస్తున్న మైలురాళ్లు : 

- టెస్టులలో మరో 38 పరుగులు చేస్తే 8వేల పరుగుల క్లబ్ లో చేరిక   
- మొహాలీ టెస్టులో సెంచరీ చేస్తే వందో టెస్టులో సెంచరీ చేసిన పదో ఆటగాడిగా గుర్తింపు.. అంతేగాక  రికీ పాంటింగ్  సెంచరీల (71) తో సమానం. 
- భారత్ నుంచి 11 మంది క్రికెటర్లు వంద టెస్టులు ఆడారు. వారిలో ఒక్కరు కూడా వందో మ్యాచులో సెంచరీ చేయలేదు. కోహ్లి  ఆ రికార్డును సాధిస్తాడా..?  

సచిన్ నమ్మకాన్ని నిజం చేస్తూ.. 

సచిన్ శతక శతకాలు పూర్తి చేసిన నేపథ్యంలో పలువురు భారత క్రికెటర్లు,  బాలీవుడ్ స్టార్లతో  ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ సందర్బంగా సల్లూ భాయ్ సచిన్ ను ఓ ప్రశ్న అడిగాడు.  ‘మీరు 100 సెంచరీలు  చేశారు. ఇప్పుడు మేం మరో వంద సెంచరీలను చూడగలుగుతామా..? దానికి ఎంత టైం పట్టొచ్చు..?  ఒకవేళ మీ రికార్డులను బద్దలు కొట్టాలంటే ఇప్పుడున్న భారత జట్టులో ఎవరి వల్ల సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు..?’ అని ప్రశ్నించాడు.

దానికి సచిన్ చెప్పిన సమాధానం.. ‘ఇక్కడ చాలా మంది యువ క్రికెటర్లున్నారు. వారిలో చాలా మందికి నా రికార్డులను బ్రేక్ చేసే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు యువ క్రికెటర్లయితే కచ్చితంగా నా రికార్డులను బ్రేక్  చేస్తారు..’ అని  చెప్పాడు సచిన్. రికార్డుల సంగతి అటుంచితే సచిన్ జట్టులో లేని లోటును మాత్రం ఈ నయా  వెటరన్స్ భర్తీ చేశారు. శుక్రవారం లంకతో టెస్టు ఈ ఇద్దరికీ ప్రత్యేకమే.. ఇది కోహ్లికి వందొ టెస్టు.. రోహిత్ శర్మకు కెప్టెన్ గా తొలి టెస్టు.. ఈ ప్రత్యేకమైన సందర్భంలొ భారత జట్టు  చిరస్మరణీయ విజయం సాధించాలని, కోహ్లి మళ్లీ  మునపటి బాట పట్టాలని  టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్  ఆశిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన