Virat Kohli: వంద టెస్టులు ఆడతానని కలలో కూడా ఊహించలేదు.. చిన్న స్కోర్లంటే అస్సలు నచ్చవు : కోహ్లి

Published : Mar 03, 2022, 05:36 PM ISTUpdated : Mar 03, 2022, 05:38 PM IST
Virat Kohli: వంద టెస్టులు ఆడతానని కలలో కూడా ఊహించలేదు.. చిన్న స్కోర్లంటే అస్సలు నచ్చవు : కోహ్లి

సారాంశం

Virat Kohli 100th Test: జూనియర్ ప్రపంచకప్ నెగ్గి భారత జట్టులోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లి ఆనతికాలంలోనే..  కీలక ఆటగాడిగా ఎదిగాడు. భారత క్రికెట్ లో సచిన్ యుగం ముగుస్తున్న తరుణంలో వచ్చిన కోహ్లి పదుల సంఖ్యలో చరిత్రాత్మక ఇన్నింగ్సులు ఆడాడు. 

మొహాలీ వేదికగా శుక్రవారం నుంచి భారత జట్టు శ్రీలంకతో తొలి టెస్టులో తలపడనున్నది. భారత జట్టుకు ఇదో ప్రత్యేకమైన సందర్భం. టెస్టులతో పాటు అన్ని ఫార్మాట్లలో  టీమిండియాను అగ్రస్థానాన నిలిపిన ఇద్దరు ఆటగాళ్లకైతే మరీ ప్రత్యేకం. ఆ ఇద్దరు ఆటగాళ్లలో ఒకరు విరాట్ కోహ్లి.. మరొకరు రోహిత్ శర్మ. కోహ్లికి ఇది టెస్టు కెరీర్ లో వందో టెస్టు.. ఇక అతడి నుంచి సారథ్య బాధ్యతలు తీసుకుని భారత జట్టును విజయపథంలో నడుపుతున్న  రోహిత్ శర్మకు ఇది పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి టెస్టు.  హిట్ మ్యాన్ విషయం కాసేపు పక్కనెడితే కోహ్లికి ఇది ఎంతో ప్రత్యేకమైన విషయం. తన కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను  అధిగమించిన ఈ వెటరన్.. లంకతో మ్యాచుతో నూరో టెస్టు ఆడనున్న నేపథ్యంలో  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడు మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేసింది. 

బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో కోహ్లి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.  తాను భారత జట్టు తరఫున వంద టెస్టులు ఆడతానని కలలో కూడా ఊహించలేదని, ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని చెప్పుకొచ్చాడు. చిన్నప్పట్నుంచే తనకు   తక్కువ స్కోర్లంటే నచ్చేవి కాదని, కొడ్తే సెంచరీలే చేయాలని లక్ష్యంగా పెట్టుకునేవాడినని అన్నాడు. 

 

కోహ్లి చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే.. ‘భారత జట్టు తరఫున వంద టెస్టులు ఆడతానిని నేను కలలో కూడా ఊహించలేదు. ఇది సుదీర్ఘమైన ప్రయాణం. ఈ క్రమంలో నేను ఎంతో క్రికెట్ ఆడాను. ఇందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దేవుడి దయ వల్ల నేను ఫిట్నెస్ కోసం ఎంతో శ్రమించాను. వందో టెస్టు అనేది నాకు, నా కుటుంబానికి, నా కోచ్ కు ఎంతో పెద్ద విషయం.  ఇంకా చెప్పాలంటే ఇది మాకు  ఓ ప్రత్యేకమైన సందర్భం.. 

నాకు చిన్నప్పట్నుంచే మ్యాచులలో తక్కువ స్కోర్లు చేయడమంటే నచ్చదు. నేనెప్పుడు గ్రౌండ్ లోకి దిగిన భారీ స్కోర్ చేయాలనే మైండ్ సెట్ తోనే ఉండేవాడిని.  జూనియర్ క్రికెట్ లో కూడా నేను బహుశా ఏడెనిమిది డబుల్ హండ్రెడ్స్ చేసుంటా. క్రీజులో ఎక్కువ సేపు నిలవాలన్నదే నా లక్ష్యం.. నా దృష్టిలో టెస్టు క్రికెటే అసలైన క్రికెట్. అది సజీవంగా ఉండాలి...’అని  కోహ్లి ముగించాడు. 

ఇక.. టీమిండియా తరఫున వంద టెస్టులు ఆడిన క్రికెటర్లలో కోహ్లి 12 ఆటగాడు. కోహ్లి కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్,  సునీల్ గవాస్కర్, వెంగ్సర్కార్, సౌరవ్ గంగూలీ, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ లు ఈ జాబితాలో ఉన్నారు. 99 టెస్టులు ఆడిన కోహ్లి.. 7,962 పరుగులు  చేశాడు. సగటు 50.39 గా ఉంది. ఇందులో 27 సెంచరీలు కూడా ఉన్నాయి.  మరో 38 పరుగులు చేస్తే కోహ్లి 8 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ల జాబితాలో చేరతాడు.  ఇదిలాఉండగా.. 71 వ సెంచరీ కోసం  28 నెలలుగా వేచి చూస్తున్న అతడి అభిమాలను కోరికను కోహ్లి.. మొహాలీ టెస్టులో తీర్చుతాడా..? ఇప్పుడిదే హాట్ టాపిక్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన