
లలిత్ మోడీకి ఏ ముహుర్తాన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆలోచన వచ్చిందో గానీ భారత క్రికెట్ కు మాత్రం ఇది కాసుల పంట పండిస్తున్నది. యేటికేడు ఈ లీగ్ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరుగుతున్నది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి నిత్యం డబ్బులు కురిపించే కామధేనువు అవుతున్నది. ఇప్పటికే ఈ లీగ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. దీంతో జతకట్టేందుకు భారీ కార్పొరేట్లు సైతం పోటీ పడుతుంటే తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో నడుస్తున్న ‘రూపే’ కూడా ఐపీఎల్ తో చేతులు కలిపింది. ఇకనుంచి రూపే కూడా ఐపీఎల్ కు ‘అఫిషియల్ స్పాన్సర్’ గా వ్యవహరించనుంది.
ఈ మేరకు ఎన్పీసీఐ.. ఐపీఎల్ తో మూడేండ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నది. పలు మీడియా కథనాలలో వస్తున్న సమాచారం మేరకు.. ఏడాదికి రూ. 42 కోట్ల ఒప్పందంతో డీల్ కుదిరినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఐపీఎల్ కు ఈ ఏడాది ప్రముఖ ఫుడ్ ఆన్లైన్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ కూడా చేతులు కలిపిన విషయం తెలిసిందే.
మార్చి 26 నుంచి మహారాష్ట్ర వేదికగా ప్రారంభం కాబోయే ఐపీఎల్-2022 సీజన్ కు గాను ‘టాటా’ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. టాటాతో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఐపీఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఐపీఎల్ 2022 సెంట్రల్ స్పాన్సర్స్ :
- టాటా : టైటిల్ స్పాన్సర్
- డ్రీమ్ 11 : అఫిషియల్ పార్ట్నర్
- అన్ అకాడెమీ : అఫిషియల్ పార్ట్నర్
- క్రెడ్ : అఫిషియల్ పార్ట్నర్
- అప్స్టాక్స్ : అఫిషియల్ పార్ట్నర్
- స్విగ్గీ ఇన్స్టాంట్ : అఫిషియల్ పార్ట్నర్
- పేటీఎం : అఫిషియల్ అంపైర్ పార్ట్నర్
- సీయట్ : అఫిషియల్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్ట్నర్
కాగా రూపేతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందిస్తూ.. ‘ఐపీఎల్ తో రూపే జతకలిసినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఐపీఎల్, రూపే కలయికతో భారత్ లోని రెండు అత్యుత్తమ బ్రాండ్లు ఒకచోట చేరాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులపై ప్రభావాన్ని చూపుతుంది. ఇండియాలో డిజిటల్ చెల్లింపుల స్వీకరణకు ఈ డీల్ ఎంతగానో ప్రోత్సహిస్తుంది..’ అని అన్నారు.
ఇక ఇదే విషయమై ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రణయ్ రాయ్ మాట్లాడుతూ.. ‘భారత్ లో అత్యంత ప్రజాధరణ కలిగిన స్పోర్ట్స్ లీగ్ లలో ఒకటైన ఐపీఎల్ తో భాగస్వాములమవడం మాకు ఆనందంగా ఉంది. రెండు అత్యుత్తమ బ్రాండ్లు ఒకచోటకు వస్తున్నందున రూపే మరింత ప్రజాధరణ పొందుతుందని మేము నమ్ముతున్నాం. ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులందరికీ వినోదాన్ని అందిస్తున్నట్టే.. రూపే కూడా దేశవ్యాప్తంగా ప్రజలకు వినూత్నమైన ఆఫర్లను అందిస్తున్నది..’అని తెలిపారు.