
8 Cricketers Retire in One Month: గత నెల నుంచి నెలన్నర కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో పలువురు కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించారు. కొంతమంది ఒకే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పగా, మరికొందరు అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. ఇందులో భారత స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి టాప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ లిస్టును గమనిస్తే..
2025 మే 7న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. తన అద్భుతమైన బ్యాటింగ్ హిట్టింగ్ తో ‘హిట్‌మ్యాన్’గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ.. 67 టెస్టుల్లో 4301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ కెప్టెన్‌గా, అతని బాటింగ్ శైలి అభిమానులను ఆకట్టుకుంది.
మే 12న విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పారు. 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశాడు. తన టెస్టు కెరీర్ లో విరాట్ కోహ్లీ 7 డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు బాదాడు. 2011లో వెస్టిండీస్ వేదికగా టెస్ట్ కెరీర్ ప్రారంభించిన విరాట్, జనవరి 2025లో ఆసీస్‌తో చివరి మ్యాచ్ ఆడారు.
జూన్ 2న గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 149 వన్డేల్లో 3990 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్, టీ20 ఫార్మాట్‌ను కొనసాగిస్తానని తెలిపారు. 2023 వరల్డ్ కప్‌లోని 201* పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్‌లో హైలైట్ గా నిలిచింది.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ 33 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఆయన 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 487 పరుగులు చేశారు.
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 106 టీ20లు, 61 వన్డేల్లో అతను 4000కి పైగా పరుగులు చేశారు. ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున పరుగుల వరద పారించాడు.
శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మ్యాథ్యూస్ మే 23న టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 17 జూన్ నుంచి బాంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే సిరీస్‌లోని తొలి టెస్ట్ ఆయనకు చివరిది అవుతుంది. 2009లో టెస్ట్ డెబ్యూ చేసిన మ్యాథ్యూస్‌కు బాంగ్లాదేశ్ మ్యాచ్ 17 ఏళ్ల కెరీర్ ముగింపు కానుంది.
భారత లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడి 43 వికెట్లు తీశాడు. చావ్లా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో భాగంగా ఉన్నారు.
గుజరాత్‌కు చెందిన ఓపెనర్ ప్రియాంక్ పంచాల్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 8856 పరుగులు చేశారు. 2016లో 314* స్కోర్ చేసి గుజరాత్ తరఫున ట్రిపుల్ సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచారు.