
ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఐడెన్ మార్క్రామ్ చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక పోరులో అతను తన కెరీర్ ఎనిమిదో సెంచరీ (136 పరుగులు) నమోదు చేసి ప్రోటీస్ జట్టుకు విజయాన్ని అందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ కొట్టిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఐడెన్ మార్క్రామ్ నిలిచాడు.
ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన మూడవ ఆటగాడిగా మార్క్రామ్ నిలిచాడు. అంతకుముందు 1975 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్), 1996 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అరవింద్ డి సిల్వా (శ్రీలంక) సెంచరీలు సాధించారు. అలాగే, ఐసీసీ టోర్నీ ఫైనల్ ఛేజింగ్‌లో సెంచరీ కొట్టిన ఐదవ ప్లేయర్ గా కూడా మార్క్రామ్ ఘనత సాధించాడు.
శనివారం (జూన్ 14న) లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించి దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఐసీసీ ట్రోఫీ కోసం 27 ఏళ్ల నిరీక్షణకు ప్రోటీస్ జట్టు ముగింపు పలికింది. 1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ (ఇప్పుడు ICC ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన తర్వాత ఇప్పుడు సౌతాఫ్రికా తొలిసారిగా డబ్ల్యూటీసీ ట్రోఫీని సాధించింది.
లార్డ్స్ పిచ్‌పై మొదట బౌలింగ్ చేయడానికి ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు కగిసో రబడా మంచి ఆరంభం అందించాడు. 51 పరుగులు ఇచ్చ 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (66 పరుగులు), బ్యూ వెబ్‌స్టర్ (72 పరుగులు) మంచి ఇన్నింగ్స్ లను ఆడారు.
బౌలింగ్ సమయంలో ఆస్ట్రేలియా తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సంచలన ప్రదర్శన చేసి 28 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు, దక్షిణాఫ్రికాను కేవలం 138 పరుగులకే కుప్పకూల్చాడు. మ్యాచ్ ఒక వైపు నుండి మరొక వైపుకు వేగంగా ఊపందుకోవడంతో ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని సాధించింది.
రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టు 7 వికెట్లకు 73 పరుగుల వద్ద తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో మిచెల్ స్టార్క్ అజేయంగా 58 పరుగులు, అలెక్స్ క్యారీ 43 పరుగుల ఇన్నింగ్స్ లతో 207 పరుగులు చేసింది. మొత్తంగా ఆస్ట్రేలియా 281 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
దక్షిణాఫ్రికా జట్టు టార్గెట్ ను అందుకోవడంలో తడబాటుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కానీ ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా అద్భుతమైన ఆటతో ప్రోటీస్ జట్టు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. మార్క్రామ్ అద్భుతమైన 136 పరుగులు సెంచరీ ఇన్నింగ్స్, బావుమా 66 పరుగుల నాక్ తో జట్టును విజయం వైపు నడిపించారు. 4వ రోజు 5 వికెట్ల తేడాతో ఆసీస్ పై గెలిచి సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ 2025 ఛాంపియన్ గా నిలిచింది.